Lottery: అదృష్టం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో చెప్పలేం. ఉన్నవాడికి అదృష్టం వరించడం లేదు. మధ్యతరగతి వాళ్లకు.. పేదలకు అదృష్టం వరిస్తే వారు పడే ఆనందానికి అవధులు ఉండవు. ఓ ట్రక్కు నడిపే వ్యక్తికి అలాంటి అదృష్టమే వరించింది. అది కూడా సంక్రాంతి రోజున. అతనికి లాటరీలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.10 కోట్లు వచ్చాయి. పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాకు చెందిన హర్పిందర్ సింగ్ అనే వ్యక్తి కొంత కాలం క్రితం అప్పు చేసి మరీ కువైట్ వెళ్లాడు. అక్కడ ట్రక్కు డ్రైవర్‌గా పనిచేసుకుంటున్నాడు.
తన ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడై తనను బాగా చూసుకుంటాడని అనుకున్న హర్పిందర్‌కు షాకింగ్ సంఘటన ఎదురైంది. ఓ ప్రమాదంలో తన కొడుకు చెయ్యి పోయింది. ఆర్థిక ఇబ్బందులతో అతనికి అందించాల్సిన చికిత్సను కూడా సరిగ్గా అందించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో మొన్న సంక్రాంతి రోజున హర్పిందర్‌ను అదృష్టం వరించింది. సంక్రాంతి సందర్భంగా తన ఇంటికి వచ్చిన హర్పిందర్ స్థానికంగా ఉండే లాటరీ సెంటర్ నుంచి రూ.500 పెట్టి టికెట్ కొన్నాడు.
ఆ టికెట్ ద్వారా హర్పిందర్‌కు రూ.10 కోట్లు వచ్చాయి. దాంతో హర్పిందర్ స్థానికంగా ఫేమస్ అయిపోయాడు. దాదాపు 15 సంవత్సరాల నుంచి లాటరీ కొంటున్నానని.. ఈ సారి దేవుడు తనను కరుణించాడని అన్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా లాటరీ టికెట్ కొనాలని అంటున్నాడు. తనకు వచ్చిన డబ్బుతో తన కుమారుడికి చికిత్స చేయించి.. కువైట్‌కి వెళ్లడానికి చేసిన అప్పు తీర్చేస్తానని అన్నాడు. అయితే రూ.10 కోట్లు మొత్తం ఇవ్వలేరు కాబట్టి.. 30% ట్యాక్సులు కట్ చేసి మిగతా మొత్తం హర్పిందర్ బ్యాంక్ ఖాతాలో వేయనున్నారు.