Powerful Temple: సొంతిల్లు ఉండాలని కోరుకోని వారు ఉండరు. ఇప్పుడు పరిస్థితులను చూస్తుంటే ఇప్పటివరకు సొంతిల్లు లేని వారు మున్ముందు తీసుకోవాలన్నా భయపడేలా ఉన్నాయి ఖర్చులు, ఆర్థిక పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో సొంతింటి కల నెరవేరుతుందా అంటే.. దైవానుగ్రహం ఉంటే తప్పకుండా నెరవేరుతుందనే చెప్పాలి. మిరాకిల్స్ అనేవి దైవాజ్ఞతోనే జరుగుతాయని అనుకుంటూ ఉంటాం కదా. ఇది కూడా అలాంటిదే అనుకోండి. అయితే.. సొంతింటి కల నెరవేరాలన్నా.. ఏవైనా భూ వివాదాలు ఉన్నా ఈ 2500 ఏళ్ల నాటి ఆలయానికి వెళ్తే ఇట్టే నెరవేరిపోతాయట. మనం ఏ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నామో ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది.
అదేనండీ.. శ్రీ భూవరాహ స్వామి ఆలయం. కర్ణాటకలోని మైసూరులో ఉన్న కల్లహళ్లి ప్రాంతంలో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించుకుని.. ఇక్కడి నుంచి గుప్పెడు మట్టిని ఇంటికి తీసుకెళ్తే సొంతింటి కల నెరవేరుతుందని చెప్తుంటారు. ఇక్కడ భూవరాహ స్వామి విగ్రహం సాలిగ్రామంతో 15 అడుగుల ఎత్తులో ఉంటుంది. వరాహ స్వామి ఒడిలో భూదేవి కూర్చుని ఉంటుంది. ఎంతో చూడముచ్చటగా ఉంటుందా విగ్రహం.
అయితే.. ఇక్కడ ఈ విగ్రహం ఎలా వెలసిందంటే.. ఓసారి హోయసల రాజు వీర భల్లాలకు ఓ విచిత్రమైన దృశ్యం కనిపించదట. ఆ దృశ్యంలో ఒక ప్రదేశంలో కుందేలు కుక్కని వేటాడుతోంది. ఇదేం వింత అనుకుని ఆ ప్రదేశాన్ని పరిశీలించి చూస్తే భూవరాహ స్వామి విగ్రహం బయటపడిందని.. దాంతో అక్కడే ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించారని చెప్తుంటారు. ఆ తర్వాత వీర భల్లాల-2 ఆ ఆలయాన్ని పునర్మించారు. ప్రస్తుతానికి ఆ ఆలయాన్ని స్థానిక పరకాల మఠ పీఠాధిపతులు సంరక్షిస్తున్నారు. భక్తులు ఈ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి గుప్పెడు మట్టిని ఇంటికి తీసుకెళ్తుంటారు. వారి కోరిక నెరవేరిన తర్వాత రెండు ఇటుకలను తెచ్చి ఒకటి గుడిలో మరొకటి తమ ఇంట్లో పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వరాహ జయంతి రోజున ఈ ఆలయంలో స్వామివారికి 1008 కలశాలతో అభిషేకం నిర్వహిస్తుంటారు.