Supreme Court Warning Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సర్వోన్నత న్యాయస్థానం చురకలంటించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కోర్టు ఎంత సమయం ఇచ్చినప్పటికీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మాటిమాటికీ పిటిషన్లు తిరిగి విచారణకు వస్తున్న నేపథ్యంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవడంతో వారిపై అనర్హత వేటు వేయాలని భారత రాష్ట్ర సమితి మూడు వేర్వేరు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే.
వీటిపై జులై 31 నాటికి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్పీకర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం లేదు. దాంతో ఈరోజు మళ్లీ ఈ పిటిషన్లు విచారణకు రావడంతో గవాయ్ మండిపడ్డారు. స్పీకర్ అయినంత మాత్రాన రాజ్యాంగంలో వారికి ప్రత్యేక హక్కులు ఉంటాయనుకుంటే అది వారి భ్రమే అని.. ఏ స్థానంలో ఉన్నవారైనా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. మరో నాలుగు వారాలు సమయం ఇస్తున్నామని.. ఈలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుని జైలుకు పంపాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి.. ఇప్పటికైనా స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకుంటారో లేదా.. జైల్లో కూర్చుని 2026 న్యూఇయర్‌ను అక్కడే జరుపుకుంటారో ఆయనే నిర్ణయించుకోవాలని చురకలంటించింది.





