Varanasi: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి భారతదేశంలో 1.43 IMAX స్క్రీన్ రావాలని ఆశాభావం వ్యక్తం చేసారు. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో జక్కన్న తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాకు సంబంధించి నిన్న జరిగిన ఈవెంట్ హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. IMAX (1.43:1 రేషియో) స్క్రీన్‌కి సరిపడా షూటింగ్ చేసిన రెండో సినిమా వారణాసేనట. ఈ విషయాన్ని IMAX కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రీతమ్ డ్యానియల్ ఎక్స్‌లో ట్వీట్ చేసారు. దీనికి రాజమౌళి రిప్లై ఇస్తూ.. కనీసం వారణాసి రిలీజ్‌కి ముందు కానీ రిలీజైనప్పుడు కానీ భారతదేశంలో ఒక్క IMAX 1.43 స్క్రీన్ అయినా ఉండాలని ఆయన కోరారు. తాను నివసిస్తున్న హైదరాబాద్‌లో ఇలాంటి స్క్రీన్ ఒకటి వస్తే ఇంకా బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇక IMAX 1.43 స్క్రీన్‌కి తగ్గట్టుగా తెరకెక్కుతున్న మరో చిత్రం రామాయణ. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా… సాయి పల్లవి సీత పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ నటుడు యష్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో 1.90:1 లేజర్ స్క్రీన్స్ ఉన్నాయి. ఈ 1.90:1 స్క్రీన్ కంటే అతిపెద్ద స్క్రీన్ ఏదన్నా ఉందంటే అది 1.43:1 IMAX. దీనిని IMAX గ్రాండ్ థియేటర్ అని కూడా పిలుస్తారు.
ప్రపంచం మొత్తంలో ఈ ఫార్మాట్ అతిపెద్దది. సీలింగ్ నుంచి ఫ్లోర్ వరకు ఎత్తు ఉంటుంది. ప్రస్తుతానికి మెల్‌బోర్న్, సిడ్నీ, లాస్ ఏంజెల్స్, లండన్‌లో మాత్రమే ఈ ఫార్మాట్ స్క్రీన్స్ ఉన్నాయి. అయితే.. రాజమౌళి ఇలాంటి స్క్రీన్ మన హైదరాబాద్‌లో వస్తే బాగుంటుందని ట్వీట్ చేయగానే నెటిజన్లు మహేష్ బాబు, అల్లు అర్జున్‌లను ఇలాంటి స్క్రీన్‌ను మీరే మీ థియేటర్లలో ఎందుకు నిర్మించకూడదు అని వారిని ట్యాగ్ చేస్తున్నారు. ఈ ఫార్మాట్‌ను అత్యధికంగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ వాడుతుంటారు.
ఆయన డైరెక్ట్ చేసిన ఓపెన్‌హైమర్, డన్‌కర్క్, ఇంటర్‌స్టెలార్ సినిమాలు ఇదే ఫార్మాట్‌లో తీసారు. ఈ ఫార్మాట్‌లో సినిమాలు తీస్తే సీన్‌కి తగ్గట్టు తెర ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకే నోలాన్ తీసిన సినిమాల సీన్లు మన భారతదేశంలోని IMAX స్క్రీన్లలో సరిపోవు. ఆ 1.43 స్క్రీన్‌ను కనీసం వారణాసి సినిమా కోసమైనా IMAX సంస్థ నిర్మించకపోదా అని రాజమౌళి ఆశ.






