Signs Of Healthy Heart: మనకేదన్నా అనారోగ్య సమస్యలు ఉంటే శరీరంలో లక్షణాలు కనిపించేస్తాయి. వాటిని బట్టి మనం వైద్యులను సంప్రదిస్తుంటాం. అయితే.. ఈ రోజుల్లో గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువైపోతున్నాయి. రోజుకొకసారైనా ఫలానా వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడనో.. చిన్నారి స్కూల్‌లోనే గుండె పోటుతో కుప్పకూలిపోయిందనో చూస్తుంటాం. దాంతో గుండె దగ్గర ఏదన్నా చిన్న నొప్పి అనిపించినా గుండెపోటేమో అని బెంబేలెత్తిపోతుంటాం.
ఆరోగ్యానికి సంబంధించిన విషయాలకంటే అనారోగ్యానికి సంబంధించిన విషయాలపైనే నెగిటివిటీ ఎక్కువ అయిపోతోంది. ఈ లక్షణాలు ఉంటే మీకు ఈ సమస్య ఉన్నట్లే అని.. ఫలానా పండు లేదా ఆకుకూర తింటే ఈ సమస్య ఉండదు అని చెప్పే సోషల్ మీడియా డాక్టర్లు ఎక్కువైపోయారు. అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండటంలో తప్పు లేదు కానీ.. మన శరీరం ఆరోగ్యంగా ఉంది అన్న విషయాన్ని కూడా గుర్తించడం ముఖ్యమే కదా. ఈరోజుల్లో నానా గడ్డి తింటూ టెన్షన్లు పెట్టుకుని ఆరోగ్యంగా ఎలా ఉంటామండీ అనుకుంటారేమో. అందరికీ సమస్యలు ఉంటాయి. అలాగని అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారని.. అందరికీ గుండె సమస్యలు ఉన్నాయని కాదు కదా. మనకు గుండె సమస్య ఉందని శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు ఎలాగైతే తెలియజేస్తాయో.. మన గుండె ఆరోగ్యంగానే ఉందని తెలియజేసే లక్షణాలు కూడా ఉంటాయి. గుండె సమస్యలకు ప్రధాన కారణం హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ అన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆ బీపీ అనేది మనకు లేదు అని తెలియజేసే లక్షణాలు ఉన్నాయి.అవేంటో తెలుసుకుందాం. (Signs Of Healthy Heart)
మీ బ్లడ్ ప్రెషర్ 120/80 ఉందనుకోండి.. మీ గుండె పదిలంగా ఉన్నట్లే. అయితే ఎప్పుడో ఒకసారి చెక్ చేయించుకున్నప్పుడు 120/80 ఉండి.. మిగతా సమయాల్లో పెరిగితే అప్పుడు కాస్త జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు చెకప్ చేయించుకున్నా 120/80 ఉంటే మాత్రం మీ గుండె గట్టిగానే ఉందని అర్థం.
హైపర్ టెన్షన్ ఉన్నవారిలో కనిపించే సాధారణ, ప్రధానమైన లక్షణాలు తలనొప్పి, ముక్కులో నుంచి రక్తం కారడం, సరిగ్గా ఊపిరి అందకపోవడం. మీకు ఇలాంటి లక్షణాలు కనిపించకపోతే మీకు హైపర్ టెన్షన్ లేనట్లే. అంటే.. మీ గుండె బాగున్నట్లే..!
హార్ట్ రేట్ ఎలా ఉందో కూడా చూసుకోవడం చాలా ముఖ్యం. హార్ట్ రేట్ చూసేటప్పుడు RHR చూస్తారు. RHR అంటే రెస్టింగ్ హార్ట్ రేట్. అంటే మీరు కూర్చుని ఉన్నప్పుడు, పడుకుని ఉన్నప్పుడు మీ గుండె ఎలా కొట్టుకుంటోందో చూసే దాన్నే రెస్టింగ్ హార్ట్ రేట్ అంటారు.
పెద్దవాళ్లలో అయితే రెస్టింగ్ హార్ట్ రేటు నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. కానీ అథ్లెట్స్‌కి మాత్రం రెస్టింగ్ హార్ట్ రేటు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లుకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఇవి సర్వసాధారణంగా కనిపించే లక్షణాలు.
మీ గుండెలోని రక్తనాళాలు, ధమనాలు బాగానే ఉన్నట్లైతే.. ఎక్కడా కూడా కొవ్వు పేరుకుని ఉండకపోతే మీకు గుండె సమస్యలు లేవని అర్థం. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉన్నా కూడా గుండె ఆరోగ్యంగా ఉందని తెలుసుకోవాలి. (Signs Of Healthy Heart)