Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై ఇటీవల దాడి జరగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సైఫ్ తన భార్య కరీనా కపూర్, పిల్లలతో కలిసి ఇంట్లో ఉన్నప్పుడే ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి.. రాత్రి అయ్యే వరకు ఓ గదిలో నక్కి ఆ తర్వాత ఇంట్లో పనిచేస్తున్న ఆయాకు దొరికిపోవడం.. ఆ తర్వాత సైఫ్ పట్టుకోవడంతో అతనిపై ఆరు సార్లు కత్తితో దాడి చేయడం జరిగాయి. ఈ దాడి జరిగిన దాదాపు మూడు రోజుల తర్వాత ముంబై పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సైఫ్ వారం రోజుల్లో కత్తిపోట్ల నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు.
అయితే.. ఈ మధ్యకాలంలో సైఫ్ మీడియాతో తనపై జరిగిన దాడి గురించి సైఫ్ ఎక్కువగా స్పందిస్తున్నారు. తనపై దాడి చేసిన వ్యక్తి పట్ల ఆయన జాలి చూపుతున్నారు. పాపం ఇప్పుడు అతని జీవితం గురించి తలుచుకుంటుంటే చాలా బాధగా ఉందని అన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా తాను సెక్యూరిటీని పెంచాలని అనుకోవడం లేదని.. ఎందుకంటే ఇది తనపై కక్షతో ముందు నుంచి ప్లాన్ చేసింది కాదని.. ఓ వ్యక్తి తన కడుపు నింపుకోవడం కోసమో లేదా ఆర్థిక పరిస్థితుల వల్లో ఇలా చేసాడు కాబట్టి.. తాను భయపడి అధిక సిబ్బందిని నియమించుకోవాలని అనుకోవడం లేదని అన్నారు. తన ఇంట్లోకి ఓ దొంగ దూరాడు అని తెలిసినప్పుడు ముందు అతనితో మాట్లాడి సవ్యంగానే వ్యవహరించాలని అనుకున్నానని.. కానీ అతను భయపడి తనపై కత్తి దూయడంతో తనని తాను సంరక్షించుకోవడానికి చేయి చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పుడు అతని పట్ల ఏం జరుగుతుందో తలుచుకుంటుంటేనే బాధగా ఉందని.. కానీ చట్టం తన పని తాను చేసుకుని పోతుంది కాబట్టి తాను ఏమీ చేయలేనని అన్నారు.