Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని ఎట్టకేలకు ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకోగానే తన దగ్గరున్న వస్తువులను చూడగా.. అతను భారతీయుడు కాదు బంగ్లాదేశ్ వాసి అని పోలీసులు గుర్తించారు. అతని అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్. భారత్‌కు అక్రమంగా వచ్చి విజయ్ దాస్‌గా పేరు మార్చుకుని ముంబైకి చెందిన ఓ కీపింగ్ ఏజెన్సీ కంపెనీలో చేరాడు.
ఆ తర్వాత అక్కడ ఉద్యోగం పోవడంతో ఒక సెలబ్రిటీ ఇంట్లోకి చొరబడి డబ్బు దొంగలించాలని ప్లాన్ వేసాడు. దాదాపు 6 నెలలుగా ఈ ప్లాన్‌లో నిందితుడు ఉన్నాడు. సైఫ్ ఇంట్లోకి సులువుగా ప్రవేశించచ్చు అని తెలుసుకున్న షరీఫుల్ డబ్బు కానీ విలువైన వస్తువులు కానీ దొంగిలించి పారిపోవాలనుకున్నాడు. కానీ దొరికిపోయే సరికి తప్పించుకునేందుకు సైఫ్‌పై దాడికి దిగాడు. సైఫ్ ఇంట్లోకి చోరీకి పాల్పడాలనుకోవడం.. సైఫ్‌పై దాడి చేయడంతో పాటు అక్రమంగా భారత్‌లోకి వచ్చినందుకు గానూ పాస్‌పోర్ట్ యాక్ట్ ఛార్జెస్ కూడా పెట్టారు. పోలీసులు నిందితుడిని విచారణ చేస్తున్నారు.
క్లీనర్‌గా చేరి
సైఫ్ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్న నిందితుడు ఎలాగైనా ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించాలో ఒక ప్లాన్ వేయాలనుకున్నాడు. ఇందుకోసం ప్లాన్ ప్రకారం హౌజ్ కీపింగ్ ఏజెన్సీలో చేరాడు. ముంబైలో హౌజ్ కీపింగ్ ఏజెన్సీలకు మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే అక్కడ చాలా మటుకు హై ప్రొఫైల్ వీఐపీలు ఉంటారు. వారికి పనివాళ్ల అవసరం బాగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సైఫ్ ఇంట్లో పనిచేస్తున్న ఓ ఆయా క్లీనింగ్ చేయడానికి మనిషి కావాలని హౌజ్ కీపింగ్ ఏజెన్సీని సంప్రదించిందట. అలా షరీఫుల్లాకు సైఫ్ ఇంటికి వెళ్లే అవకాశం దొరికింది. క్లీనింగ్ కోసం వెళ్లిన షరీఫుల్లా ఇంట్లో ఏమేమున్నాయో.. ఎక్కడి నుంచి ద్వారాలు ఉన్నాయో అన్నీ నోట్ చేసుకున్నాడు. అయితే షరీఫుల్లాపై గతంలో ఎలాంటి క్రైంలకు పాల్పడినట్లుగా రికార్డులు లేవట. ఇలా వీఐపి ఇంట్లో దొంగతనానికి వెళ్లడం మొదటిసారి అని పోలీసులు అంటున్నారు. (Saif Ali Khan)