Champions Trophy 2025: ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మ్యాచ్‌లకు ఆతిథ్యం వహించనున్న పాకిస్థాన్‌కు వెళ్లనున్నారు. 1996 వరల్డ్ కప్ తర్వాత తొలిసారి పాకిస్థాన్ ICC మ్యాచ్‌లకు ఆతిథ్య దేశంగా వ్యవహరించనుంది. అయితే.. దాదాపు అన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోనే జరుగుతాయి కానీ.. భారత్ ఆడే మ్యాచ్‌లు, సెమీ ఫైనల్ మ్యాచ్ మాత్రం దుబాయ్‌లో జరగనున్నాయి. ఒకవేళ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే జరుగుతుంది. ఒకవేళ భారత్ గెలవకపోతే ఫైనల్ మ్యాచ్ మాత్రం జరిగేది లాహోర్‌లోనే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు వెళ్లనున్నాడు. ఎందుకంటే.. ఏ దేశమైతే మ్యాచ్‌లకు ఆతిథ్యం వహిస్తుందో.. ఆ దేశానికి మ్యాచ్ మొదలవడానికి ముందు కెప్టెన్లు వెళ్లడం ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం.
ఆల్రెడీ మనకు పాకిస్థాన్‌కి రాజకీయ పరంగా పడటం లేదు. ఈ తరుణంలో రాజకీయాలు వేరు క్రీడలు వేరు అని తెలియపరచాలన్న ఉద్దేశంతో రోహిత్ పాక్‌కి వెళ్లాలనుకుంటున్నారట. ఇకపోతే.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న టీమ్స్ ఏవంటే.. అఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిల్యాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్. కరాచీలో పాకిస్థాన్ వర్సెస్ న్యూజిల్యాండ్ మ్యాచ్‌తో ఓపెనింగ్ జరగనుంది. ఎన్ని టీమ్స్ ఆడినా మనకు ఇండియా పాకిస్థాన్ ఆడితేనే మజా కదా. మరి ఆ మ్యాచ్ ఎప్పుడు ఉందో తెలుసా? ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరగనుంది. ఇండియా పాకిస్థాన్ అంతర్జాతీయ టోర్నమెంట్లలో మాత్రమే ఆడనున్నాయి. చివరి సారి ఈ రెండు టీమ్స్ కలిసి ఆడింది ICC T20 వరల్డ్ కప్ మ్యాచ్ సమయంలో. న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. (Champions Trophy 2025)
భారత్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా పాకిస్థాన్ వేదికగానే జరగాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పట్టుబట్టింది. ఒకవేళ వేరే దేశంలో ఆడే మాటైతే అసలు భారత్‌తో తాము ఎలాంటి మ్యాచ్‌లు ఆడమని తేల్చి చెప్పేసింది. రాజకీయంగా చూసుకుంటే ప్రతీదీ మనకు పెద్ద విషయంగానే అనిపిస్తుందని.. ఆటను ఆటలాగా చూడటం మంచిదని చెప్పింది. కానీ మొత్తానికి ఇండియన్ క్రికెట్ బోర్డు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కలిసి తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాయి.