RG Kar News: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కలకత్తా అత్యాచార ఘటనలో కలకత్తాలోని సీల్దా కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌ని దోషిగా ప్రకటిస్తూ.. అతనికి ఉరిశిక్ష వేయాలా లేక 25 ఏళ్ల పాటు యావజ్జీవ కారాగార శిక్ష వేయాలా అనే అంశంపై క్లుప్తంగా సోమవారం తీర్పు వెల్లడిస్తానని న్యాయమూర్తి అనిర్బన్ దాస్ వెల్లడించారు. తీర్పు వినగానే మృతురాలి తండ్రి కోర్టులోనే కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కూతురిని తలుచుకుని ఏడుస్తూనే.. కోర్టుపై తాము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు సర్ అంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ఆయన అలా విలపిస్తుంటే జడ్జి కళ్లు కూడా చమర్చాయి. ఆ తర్వాత ఆయన్ను పోలీసులు అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లిపోయారు.
నన్ను కావాలనే ఇరికించారు
నిందితుడు సంజయ్ రాయే అని సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఆధారాలు చెప్తున్నాయి.. అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లినప్పుడు అతను నన్ను ఉరితీయండి అన్నాడు. ఇవన్నీ కేసులో కీలక సాక్ష్యాలుగా ఉన్నాయి. పైగా తాను ఆడిటోరియంలోకి వెళ్లినప్పుడే ఆ అమ్మాయి చనిపోయి ఉందని అన్నాడు. విచారణ మొత్తం ముగిసి కోర్టులో పలుమార్లు వాదోపవాదాలు జరిగాక సంజయ్ రాయే నిందితుడని.. మరో నిందితుడు ఎవ్వరూ లేరని న్యాయమూర్తి వెల్లడించారు. ఇతనికి ఎలాంటి శిక్ష వేయాలో సోమవారం ప్రకటిస్తానని చెప్పాక నిందితుడు సంజయ్ బుకాయించేందుకు యత్నించాడు. తాను ఏ తప్పూ చేయలేదని.. తనను కావాలనే ఇరికించారని అన్నాడు. తప్పు చేసినవాడిని వదిలేసి తననెందుకు శిక్షిస్తున్నారని వాదించాడు. అతని వాదనలు విన్న న్యాయమూర్తి.. సోమవారం మాట్లాడే అవకాశం ఇస్తానని అన్నారు. ప్రస్తుతం సంజయ్ రాయ్‌ని కలకత్తా ప్రెసిడెన్సీ జైలులో ఉంచారు. సంజయ్ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ మాత్రమే నిందితుడు కాదని.. ఇందులో మరికొందరి ప్రమేయం కూడా ఉందని కోర్టులో అప్లికేషన్ పెట్టుకున్నారు.
ప్రకంపనలు సృష్టించిన కేసు
ఐదు నెలల క్రితం వెస్ట్ బెంగాల్‌లో జరిగిన హత్యాచార ఘటన యావత్ భారతదేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. అంతర్జాతీయ మీడియా వర్గాలు కూడా ఈ వార్తను ప్రచురించాయంటే.. ఈ కేసు ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో తెలుస్తోంది. ప్రభుత్వం నడుపుతున్న RG కర్ మెడికల్ కాలేజ్‌లో డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల యువ వైద్యురాలు కాలేజీలోని ఆడిటోరియంలో అర్థనగ్నంగా దారుణ హత్యకు గురై కనిపించింది. వెంటనే కాలేజీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసారు. వారు వచ్చి మృతురాలిని వెంటనే పోస్ట్‌మార్టంకు తరలించడం.. ఆమె దారుణంగా అత్యాచారానికి గురైయ్యారని తేలడం.. ఆ తర్వాత అంత్యక్రియలు జరగడం అన్నీ క్షణాల్లో అయిపోయాయి. (RG Kar News)
మమ్మల్ని విచారించలేదు
ఈరోజు తీర్పు వెలువడిన నేపథ్యంలో మృతురాలి తల్లిదండ్రులు కేసును హ్యాండిల్ చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కేసులో చనిపోయింది తమ కూతురైతే.. ఒక్కరూ కూడా వచ్చి తమను విచారించలేదని అన్నారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారా అని మృతురాలి తల్లిదండ్రులను ప్రశ్నించగా.. ఏ శిక్ష సరైనదో నిర్ణయించే హక్కు తమకు లేదని.. కోర్టుకే వదిలేస్తున్నామని అన్నారు.