RG Kar Case Verdict: కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్‌లో జరిగిన ఘోరమైన హత్యాచారానికి సంబంధించిన తుది తీర్పు ఈరోజు వెలువడనుంది. కలకత్తాలోని సీల్దియా కోర్టులో వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌ని దోషిగా ప్రకటించిన న్యాయమూర్తి అనిర్బన్ దాస్.. ఈరోజు అతనికి ఎలాంటి శిక్ష విధించాలి అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఈ కేసులో రెండు శిక్షలు చర్చలో ఉన్నాయి. ఒకటి పదేళ్ల పాటు కారాగార శిక్ష.. మరొకటి క్యాపిటల్ పనిష్మెంట్. అంటే ఉరిశిక్ష. అయితే.. మన దేశంలో ఉరిశిక్షలు అంత సులువుగా వేయరు. చాలా అరుదుగా ఇలాంటి ఉరిశిక్షలు పడుతుంటాయి.
ఈ నేపథ్యంలో నిందితుడు సంజయ్ రాయ్‌కి ఉరిశిక్ష పడి తీరాల్సిందే అని మృతురాలి తరఫు న్యాయవాది వాదించారు. ఇది అత్యంత అరుదైన కేసుగా భావించాలని.. హాస్పిటల్‌లో పనిలో ఉన్న ఓ వైద్యురాలి పట్ల ఇంతటి దారుణం జరిగిందని.. ఉరిశిక్ష వేస్తేనే రేపు ఇలాంటి పనులు చేయాలన్నా కూడా వణుకు పుడుతుందని తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులు కూడా ఉరిశిక్షే విధించాలని డిమాండ్ చేస్తున్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. దోషి సంజయ్ వైపు చూస్తూ ఇలా అన్నారు. నువ్వు అత్యాచారం చేసి చంపావన్న సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వే దోషివి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావ్ అని అడిగారు. దీనికి సంజయ్ రాయ్ స్పందిస్తూ.. తాను ఏ తప్పూ చేయలేదని.. తనకు శిక్ష వేసే ముందు అది కరెక్టో కాదో న్యాయమూర్తే నిర్ణయించుకోవాలని అన్నాడు. దాంతో న్యాయమూర్తి ఏ శిక్ష వేయాలా అని పరిశీలిస్తున్నారు. (RG Kar Case Verdict)
మన దేశంలో అత్యాచార నిందితుల్లో శిక్ష పడినవారు ఎవరైనా ఉన్నారంటే అది ఢిల్లీకి చెందిన నిర్భయ కేసు నిందితులు. నిర్భయ తల్లి ఆ నలుగురు రాక్షసులకు ఉరిశిక్ష పడేలా పోరాడింది. చివరికి ఆమె తన కూతురికి న్యాయం చేయగలిగింది. కోర్టు ఉరిశిక్ష విధించడమే కాదు.. వారిని ఉరితీసేసారు కూడా. (RG Kar Case Verdict)