Renu Desai: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రాబోయే ఎన్నికల్లో ఓట్లు పడాలన్న ఉద్దేశంతో హామీలు ఇచ్చేస్తున్నారని అన్నారు నటి రేణూ దేశాయ్. కంచ గచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిధిలో ఉన్న దాదాపు 400 ఎకరాలను తవ్వేసి కంపెనీలు కట్టించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ వేసారు. ఈ నేపథ్యంలో వందలకొద్ది జేసీబీలు తెప్పించి మరీ పచ్చని చెట్లను నరకడం మొదలుపెట్టారు. ఇప్పటికే 100 ఎకరాల భూమిని తవ్వేసినట్లు తెలుస్తోంది.
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాకు దిగడం.. సుప్రీంకోర్టు కలగజేసుకోవడంతో ప్రస్తుతానికి తవ్వకాలు ఆగాయి. దీనిపై ముందు నుంచి తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు రేణూ దేశాయ్. ప్రకృతిని పణంగా పెట్టి అభివృద్ధి చేయాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ అంశం గురించి అప్డేట్లు తెలుసుకుంటూ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
ఈ నేపథ్యంలో KTRపై రేణూ కాస్త సీరియస్ అయ్యారు. కేటీఆర్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ధర్నాకు సపోర్ట్ చేస్తూ.. ఈ 400 ఎకరాలను కంపెనీలకు కట్టబెట్టాలన్న అంశానికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న ఓ ప్రెస్‌మీట్ పెట్టి.. మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక ఈ 400 ఎకరాల భూమిని ఇకో పార్క్‌గా చేస్తానని.. ఈ సందర్భంగా మీడియా సాక్షిగా హామీ ఇస్తున్నానని అన్నారు. దీనిపై రేణూ స్పందిస్తూ.. BRS ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఇకో పార్క్ చేయలేకపోయింది కానీ.. ఇప్పుడు ఉన్నట్టుండి పార్క్ కట్టిస్తాను అంటూ ఓట్ల కోసమే హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు.