Raihan Vadra: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రియాంక, రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రైహాన్ వాద్రా నిశ్చితార్ధం ఘనంగా జరగనుంది.. ఫోటోగ్రాఫర్, ప్రొడ్యూసర్ అయిన అవీవా బైగ్‌ను రైహాన్ ప్రేమ వివాహం చేసుకోనున్నారు. రాజస్థాన్‌లోని రంతంబోర్‌లో వీరి నిశ్చితార్ధం జరగనుంది. ఢిల్లీకి చెందిన అవీవా రైహాన్‌తో ఏడేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. అవీవా ఫోటోగ్రాఫర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు జాతీయ స్థాయి ఫుట్‌బాల్ ప్లేయర్ కూడా.
25 ఏళ్ల రైహాన్ డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో తన తన చదువును పూర్తి చేసాడు. గాంధీ కుటుంబానికి చెందిన చాలా మంది ఈ స్కూల్ నుంచి చదువుకున్నవారే. ఆ తర్వాత పై చదువుల కోసం SOAS యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో పాలిటిక్స్ చదివాడు. రైహాన్‌కి కూడా ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం.
ఇక రైహాన్ ప్రేయసి అవీవా గురించి చెప్పాలంటే ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఇమ్రాన్ బైగ్, ఇంటీరియర్ డిజైనర్ అయిన నందితా బైగ్ గారాలపట్టి అవీవా. నందిత, ప్రియాంకలు చిరకాల మిత్రులు. అవీవా మీడియా, జర్నలిజంలో OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ప్రియాంక, రాబర్ట్ దంపతులకు ఇద్దరు సంతానం. రైహాన్ పెద్దవాడు. కుమార్తె మిరాయా ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.





