అమ్మా నాన్నా.. మ‌మ్మ‌ల్నెందుకు చంపుతున్నారు?

అమ్మ గోరు ముద్దలు తినిపిస్తుంటే.. ఎంతో ఆనందంగా ఆ ప‌సి హృదయం క‌డుపు నిండా భుజిస్తోంది.

నాన్న బ‌య‌టికి తీసుకెళ్తుంటే ఆ ప‌సివాళ్లు ఎంతో ఆనంద‌ప‌డిపోయారు.

కానీ వాళ్ల‌కేం తెలుసు.. అల్లారుముద్దుగా పెంచిన అమ్మానాన్నే వాళ్లకు మ‌ర‌ణ‌ శాస‌నం రాస్తున్నార‌ని.

 

ఈ మ‌ధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక కార‌ణం చేత త‌ల్లిదండ్రుల్లో ఎవ‌రో ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకోవడం.. వారు ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ‌టానికి ముందు క‌న్న‌బిడ్డ‌ల్ని బ‌లి చేయ‌డం వంటివి చూస్తున్నాం. ఇప్ప‌టికే రెండు హృద‌య‌విదార‌క సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఈ రెండింటి గురించి జ‌నాలు ఇంకా మాట్లాడుకుంటుండ‌గానే నిన్న మ‌రో ఘ‌ట‌న జ‌రిగింది. ముక్కుప‌చ్చ‌లార‌ని బిడ్డ‌కు విషం ఇచ్చి ఆ త‌ల్లి కూడా అదే విషం తాగింది. బిడ్డ చ‌నిపోగా.. ఆమె మాత్రం ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డింది.

ఈ ఘ‌ట‌న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చోటుచేసుకుంది. స్థానిక‌ హరితా ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న నంబూరి సాంబశివరావు, పావని అనే దంప‌తుల‌కు జెశ్విక అనే నాలుగేళ్ల కూతురు ఉంది. సాంబ‌శివ‌రావు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. కొన్నేళ్లుగా పావ‌ని నరాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతోంది. చికిత్స చేయించుకోలేని ప‌రిస్థితో.. లేక అనారోగ్యంతో బ‌త‌క‌లేను అనుకుందో ఆ తల్లి కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలుపుకొని తాగి కూతురు జెశ్వికకు కూడా తాగించింది. సాంబశివరావుకు విషయం తెలియకపోవడంతో నిన్న రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు.

రాత్రంతా పావ‌ని, జెశ్విక‌ పలుమార్లు వాంతులు చేసుకోగా.. మరుసటి రోజు ఉదయం కూడా వాంతులు అవుతుండటంతో భర్తకు పావ‌ని అసలు విషయం చెప్పింది. దీంతో వెంటనే వారిని కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రికు తీసుకెళ్లాడు. జెశ్విక పరిస్థితి విషమించడంతో రెయిన్‌బో ఆస్పత్రికి తరలించ‌గా.. చికిత్స పొందుతూ పాప చ‌నిపోయింది. పావ‌ని మాత్రం ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది.

ఏప్రిల్ 18న హైద‌రాబాద్‌లోని గాజుల‌రామారానికి చెందిన 32 ఏళ్ల తేజ‌శ్విని అనే మ‌హిళ‌.. త‌న ఇద్ద‌రు కొడుకుల‌ను కొడ‌వ‌లితో న‌రికి చంపింది. అనంత‌రం ఆమె తాను నివ‌సిస్తున్న అపార్ట్‌మెంట్ నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. తేజ‌శ్విని కొంత‌కాలంగా కంటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుండ‌గా.. పిల్ల‌లు మాత్రం ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. వీరికి ప్ర‌తి నాలుగు గంట‌ల‌కు ముక్కులో డ్రాప్స్ వేయ‌క‌పోతే ఆయాసంతో అల్లాడిపోతారు. ఇదే విష‌యం త‌న భ‌ర్త‌కు చెప్పి మెరుగైన వైద్యం చేయించాల‌ని కోర‌గా.. అత‌ను ఒప్పుకోలేద‌ట‌. ఇదే విష‌యాన్ని తేజ‌శ్విని ఆరు పేజీల లేఖ‌లో రాసి ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు.

మార్చిలో కాకినాడ‌లో ఓ సెంట్రల్ ప్ర‌భుత్వ ఉద్యోగి త‌న ఇద్ద‌రు కొడుకుల‌ను నీటిలో ముంచి తాను కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన సంఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. పిల్ల‌లు స‌రిగ్గా చ‌ద‌వ‌డం లేద‌ని.. ఇలాగైతే రేపు స‌మాజంలో బ‌త‌క‌లేర‌ని క‌ల‌త చెందిన అత‌ను.. చావే శ‌ర‌ణం అనుకుని ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు.

ఇలా త‌ల్లిదండ్రులు వారికి ఉన్న అనారోగ్య స‌మస్య‌లు, ఇత‌ర ఇబ్బందులను త‌ట్టుకోలేక త‌మ‌తో పాటు పిల్ల‌ల్ని కూడా చంపేసుకుంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *