Pakistan: తిండికి గతిలేక బిక్కు బిక్కుమంటున్న దాయాది దేశం పాకిస్థాన్ పంట పండిందట. అదృష్టం వరించబోతోందట. ఈ మాట ఎవరో కాదు.. పాక్ ప్రధాని షెహబాజ్ షెరీఫ్ ఓ కార్యక్రమంలో అన్నారు. ఇటీవల ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ మినరల్స్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు (PMIF25) జరిగింది. అమెరికా, చైనాతో పాటు దాదాపు 300 మంది అంతర్జాతీయ డెలిగేట్లు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షెహబాజ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ కోట్లు విలువ చేసే ఖనిజాలు ఉన్నాయని.. వీటి నుంచి పుట్టే డబ్బు ద్వారా పేదరికం, ఆకలి తీరిపోతాయని అన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ… అవసరంలో ఆదుకునే IMF (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్) నుంచి కూడా సాయం అవసరం లేదు అనడం కాస్త ఓవర్ అయ్యింది.
ఖనిజాల మైనింగ్‌లో పాక్ అంతర్జాతీయ స్థాయిలో టాప్‌లో ఉండబోతోందని ధీమా వ్యక్తం చేసారు. పాకిస్థాన్‌లోని రెకో డిక్ అనే ప్రాంతంలో అత్యంత విలువైన పారిశ్రామిక ఖనిజాలు, రత్నాలు లభ్యమయ్యాయట. జాతీయ వనరుల సంస్థ వారు బెలూచిస్థాన్‌లోని చగాయ్ ప్రాంతంలో రాగి, బంగారు గుర్తించారట. కాబట్టి వివిధ దేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఎలాంటి సందేహాలు, భయాలు లేకుండా పాక్‌లో పెట్టుబడులు పెట్టచ్చని.. ఇందుకు పాక్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఖనిజాల విలువ ఎంతకాదన్నా కొన్ని ట్రిలియన్ డాలర్ల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఖనిజాలకు ప్రాసెస్ చేసి ఆ ఉత్పత్తులను ఎగుమతి చేసేలా పాక్‌లోనే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.