Manchu Vishnu: సందీప్ రెడ్డి వంగా.. రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో స్పిరిట్ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటీనటుల కోసం క్యాస్టింగ్ కాల్‌ను ప్రకటించారు. అయితే.. ఈ సినిమాలో నటించాలని మంచు విష్ణుకి కూడా ఉన్నట్లుంది. దాంతో తాను కూడా ఈ సినిమాలో నటించేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు విష్ణు ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు అవకాశం వస్తుందో రాదో వేచి చూడాలని విష్ణు అన్నారు. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు స్పిరిట్‌కి తన అప్లికేషన్‌ను పంపానని విష్ణు ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ నటించబోయే 25వ చిత్రం స్పిరిట్. టీ సిరీస్ బ్యానర్‌పై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్ కుమార్ దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అంతర్జాతీయ క్రైం సిండికేట్‌ను ఏరిపారేసే పోలీస్ అధికారి చుట్టూ ఈ కథ సాగుతుంది అంటున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనున్నారు. బాలీవుడ్ పవర్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కీలక పాత్రల్లో కనిపించే అవకాశం ఉందట. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. కాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టే సినిమాగా తెరకెక్కించబోతున్నారు. 2026 జూన్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.