Jackpot ఒక్క అంకె మనిషి జీవితాన్ని మార్చేయగలదు అంటే ఏమో అనుకున్నాం. ఈ వ్యక్తి విషయంలో అది నూటికి నూరు పాళ్లు నిజం అని తేలింది. లాటరీ టికెట్లు కొని ఎంతో మంది కోట్ల రూపాయలు గెలుచుకున్న వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. ముఖ్యంగా దుబాయ్‌లో మన భారతీయులు, తెలుగు వాళ్లు కూడా కోట్ల రూపాయలను లాటరీలో దక్కించుకున్నవారున్నారు. చాలా మందికి తమకు వచ్చిన అంకెలలో రెండు మూడు అంకెలు మిస్సవ్వడంతో లాటరీ రాకపోవచ్చు.
కానీ ఒకే ఒక్క నెంబర్ మిస్సవ్వడంతో పెద్ద మొత్తం చేజారిపోయింది. ఎంత డబ్బు పోయిందో తెలుసా? ఒకటి కాదు రెండు కాదు అక్షరాలా రూ.16,000 కోట్లు. ఇంతకు మించిన బాధాకరమైన విషయం మరొకటి ఉండదేమో. ఈ ఘటన అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో చోటుచేసుకుంది. స్పోట్సిల్వేనియా కౌంటీకి చెందిన జెఫ్రీ డైమండ్ అనే వ్యక్తి క్రిస్మస్ సమయంలో లాటరీ టికెట్ కొనుగోలు చేసాడు. ఆ లాటరీ విలువ 1.87 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.16,809 కోట్లు. దేశంలోనే ఇది రెండో అతిపెద్ద లాటరీ మొత్తం కావడంతో జెఫ్రీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు.
ఈరోజు విన్నర్‌ను ప్రకటించగా.. తనకు వచ్చిన నెంబర్లలో ఒకే ఒక్క అంకె మిస్సవడంతో ఆ లాటరీ వేరొకరికి దక్కింది. అయితే.. జెఫ్రీ మాత్రం ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లలేదు. లక్ష డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. కానీ 1.87 బిలియన్ డాలర్లు ఒక్క అంకెతో పోవడంతో పాపం అతని బాధ వర్ణనాతీతం.





