Crime News ఆ మహిళకి వయసు 33. 17 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. భర్తతో గొడవలో లేక మరేమన్నా ఇబ్బందులున్నాయో తెలీదు కానీ మరో యువకుడితో అఫైర్ పెట్టుకుంది. అంతటితో ఆగలేదు. భర్తకు తెలీకుండా లేచిపోయింది. దాంతో ఆ భర్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆమెని వెతికి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇప్పించి ఇంటికి పంపాలనుకున్నారు. కానీ ఆ వ్యక్తి తన భార్య లేచిపోవడం భరించలేకపోయాడు. పోలీస్ స్టేషన్‌లోనే ఆమెను తుపాకీతో కాల్చి చంపేసాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హార్దోయ్ జిల్లాకి చెందిన అనూప్ కుమార్, సోనీలకు 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
జనవరి 8న సోనీ సహారన్‌పూర్‌కి చెందిన 28 ఏళ్ల యువకుడితో లేచిపోయింది. దాంతో అనూప్ పోలీసులను ఆశ్రయించాడు. ఫోన్ లొకేషన్ల ఆధారంగా పోలీసులు సోనీని ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనూప్‌ని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి ఇంటికి పంపేయాలని పోలీసులు అనుకున్నారు. ఈ నేపథ్యంలో సోనీని రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. మరుసటి రోజు ఉదయం సోనీ పోలీస్ స్టేషన్ బయట ఉన్న హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా.. అనూప్ తన వద్ద ఉన్న నాటు తుపాకీతో దూరం నుంచే గురి పెట్టి కాల్చాడు. తుపాకీ సోనీ ఛాతికి తగలడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత అనూప్ పారిపోయేందుకు యత్నించాడు కానీ పోలీసులు పట్టుకున్నారు.





