Jagan: రైతులందరికీ యూరియా అందుబాటులో ఉంటే.. వాళ్లు రోడ్డెక్కాల్సిన అవసరమేంటి చంద్రబాబూ? చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం టెక్కలిలో యూరియా దొరక్క రైతులు అగచాట్లు పడుతున్నారు. సొంత నియోజకవర్గంలోనే రైతులకి బస్తా యూరియా ఇవ్వలేకపోయిన వీళ్లు.. రాష్ట్రమంతా ఏం ఇవ్వగలరు? ఏదన్నా బావి ఉంటే అందులో అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు దూకి సావచ్చు అన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. యూరియా కొరతపై ఈరోజు జగన్ మీడియా సమావేశం ఏర్పాటుచేసారు.
రాష్ట్రానికి లక్షల టన్నుల ఎరువులు వచ్చాయని ప్రభుత్వం చెబుతుంది కానీ రైతులకు ఎక్కడా యూరియా అందడం లేదని వారంతా బస్తా ఎరువు కోసం గంటలు తరబడి క్యూ లైన్‌లో నిలబడుతున్నారని అన్నారు. రైతులను ఇక్కడ నిలబెట్టి వెనుక ద్వారం గుండా ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ తెలుగుదేశం నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని సమాజాన్ని తప్పుదోవ పట్టించే విష మీడియా తమకు లేదని అవన్నీ చంద్రబాబు పక్షాన నిలిచాయని అన్నారు. తమకున్న మీడియా నిజాలు మాత్రమే చెబుతుందని నిజరూపాన్ని ప్రజల ముందు నిలబెడుతుందని చెప్పారు. చంద్రబాబు రైతులను మోసం చేస్తే.. ఎరువుల కోసం రైతులను వీధుల్లో నిలబెడితే.. ఇదేమని ప్రశ్నించినందుకు తమపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇంత దుర్మార్గమైన పాలన ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదని ఎద్దేవా చేసారు.