Ram Pothineni మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ని చూస్తుంటే తనకు జాలేస్తోందని అన్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఆయన నటించిన ఆంధ్రా తాలూకా సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మాటన్నారు. రామ్ ఇలా అనడానికి కారణం ఏంటంటే.. చాలా మంది తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన వారు అవకాశాల కోసం ఎన్ని కష్టాలు పడుతుంటారో.. అవకాశాలు వచ్చాక ఆ వచ్చిన పేరును కాపాడుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతుంటారో చూస్తూనే ఉన్నాం.
ఇండస్ట్రీ కష్టాలు చూసిన వారికి నేను మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా పుట్టినా బాగుండు.. లేదా ఇండస్ట్రీకి చెందిన ఏ కుటుంబం నుంచి వచ్చినా బాగుండు అని అనుకోకుండా ఉండరు. రామ్ కూడా ఇదే కోవకు చెందుతారు. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను చిరంజీవి కొడుకుగా పుట్టి ఉంటే ఎంత బాగుండో అని అనుకున్నారట. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్‌ని చూసి చాలా బాధ, జాలేసిందని అన్నారు. నెపోటిజం అంటూ చాలా మంది ముందు వెనక ఆలోచించకుండా మాటలు అనేస్తుంటారని.. తన తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చరణ్ పడుతున్న ఇబ్బందులు, ఒత్తిడి మాత్రం చాలా తక్కువ మందికే అర్థమవుతుందని తెలిపారు.
రామ్ నటించిన ఆంధ్రా తాలూకా సినిమాను వరుసగా బ్లాక్‌బస్టర్ సినిమాలను అందిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నువ్వుంటే చాలే, పప్పీ షేమ్ పాటలు చార్ట్‌బస్టర్స్ అయ్యాయి. ఈ సినిమాకు పి.మహేష్ బాబు దర్శకత్వం వహించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. ఇది ఒక డై హార్డ్ ఫ్యాన్ బయోపిక్ అని చెప్తున్నారు. నవంబర్ 28న సినిమా రిలీజ్ కానుంది.