Control Blood Pressure: ఒకప్పుడు దగ్గు, జలుబు, జ్వరాలు సర్వసాధారణంగా వచ్చేవి. ఇప్పుడు అంతే సర్వసాధారణంగా రక్తపోటు.. దాని నుంచి గుండెపోటులు వస్తున్నాయి. ఇది ఒప్పుకుని తీరాల్సిన నిజం. కాకపోతే జలుబు ప్రాణాలు తీయదు. కానీ గుండెపోటు మాత్రం ప్రాణాలు తీసేస్తుంది.
ఒకప్పుడు ఇంట్లో పెద్దవారికి గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు ఉండేవి. ఇప్పుడు ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మందికే ఉంటున్నాయి. గుండెపోటుకు ప్రధాన కారణం రక్తపోటు. రక్తపోటు అదుపులో ఉంటే గుండె కూడా మన మాట వింటుంది. ఒక్కోసారి కొందరిలో ఉన్నట్టుండి రక్తపోటు పెరిగిపోతుంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అది కాస్తా గుండెపోటుకు దారి తీసేలోపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ లక్షణాలు ఉన్నాయా?
రక్తపోటు ఎక్కువగా ఉంది అంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..
తలవెనుక భాగంలో నొప్పి
కళ్లు తిరగడం, చూపు సరిగ్గా లేకపోవడం
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
మరీ సీరియస్‌గా ఉంటే ముక్కులో నుంచి రక్తం రావడం
ఎలా అదుపులో ఉంచాలి?
రక్తపోటు ఉన్నట్టుండి పెరిగింది అనిపిస్తే ఈ చిట్కాలను పాటించండి.
కుర్చీలో కానీ కింద కానీ నిటారుగా కూర్చుని.. ముక్కుతో ఊపిరి పీల్చి.. ఐదు సెకెన్ల పాటు అలా నిలిపి నెమ్మదిగా నోటితో వదలండి.
ఇలా ఒక పది నిమిషాల పాటు శ్వాసపైనే ధ్యాస ఉంచగలిగితే రక్తపోటు క్రమంగా తగ్గుతుంది. మన శరీరంలో ఉండే కార్టిసాల్ అనే ఒత్తిడిని కలిగించే హార్మోన్ ఈ బ్రీతింగ్ టెక్నిక్‌కి లొంగుతుంది. అయితే రక్తపోటు ఎక్కువ అవ్వడం వల్ల పైన చెప్పిన లక్షణాలు అన్నీ ఉన్నట్లయితే ఈ టెక్నిక్ పనిచేయదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.