Indira Gandhi చరిత్రను కళ్లకు కట్టినట్లు చెప్పాలంటే అది కళ్లారా చూసిన వాళ్లే చెప్పాలి. ఇప్పుడు మనలాంటి వాళ్లు పత్రికలు, ప్రచురించబడిన పుస్తకాల్లో చదివి తెలుసుకోవాల్సిందే. ఎవరికి నచ్చింది వాళ్లు రాసేసుకుంటారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1970ల్లో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించడం.. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడం.. జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక CBI అధికారుల చేత ఆమెను అరెస్ట్ చేయించడం జరిగాయి. ఆ సమయంలో ఇందిరను అరెస్ట్ నుంచి కాపాడింది.. మళ్లీ ప్రధానమంత్రి అయ్యేలా చేసింది ఒక పాస్తా మేకర్ అంటే నమ్మగలరా? మీరు చదివింది కరెక్టే. ఇప్పుడు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్న పాస్తానే నాడు ఇందిరా గాంధీ పాలిట వరంలా మారిందని చెప్పాలి.
అసలు మ్యాటర్ ఏంటంటే.. అది 1977 అక్టోబర్ 3. ఢిల్లీలోని 12 విల్లింగ్డన్ క్రిసెంట్ వీధిలో ఇందిరా గాంధీ తన కుటుంబంతో నివసించేవారు. సీబీఐ అధికారులు ఇందిరను అదుపులోకి తీసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. వారిని చూసిన ఇందిర ఏమీ అనలేదు కానీ.. ప్యాకింగ్ చేసుకుంటాను కొంచెం సమయం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసారట. ఇందుకు అధికారులు కూడా ఓకే అన్నారు. అయితే.. ఇందిర రెండు గంటల పాటు లోపలే ఉన్నారు. అప్పటికే విసిగిపోయిన అధికారులకు ఆమె కీలకమైన డాక్యుమెంట్లు ఏమన్నా ధ్వంసం చేస్తున్నారా అనే అనుమానం వచ్చి లోపలికి వెళ్లి మరీ అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట.
ఆ తర్వాత ఆమెను కారు ఎక్కించారు. అప్పటికే మీడియా, పార్టీ నేతలు, పార్టీ వర్కర్లు ఇందిర ఇంటి చుట్టూ చేరిపోయారు. ఆ గందరగోళంలోనే ఇందిరా కీలకమైన డాక్యుమెంట్లను ధ్వంసం చేసినట్లు రచయిత్రి కేథరీన్ ఫ్రాంక్ తాను రాసిన ది లైఫ్ ఆఫ్ ఇందిరా నెహ్రూ గాంధీ అనే పుస్తకంలో ప్రస్తావించారు. అదే సమయంలో కోడలు సోనియా గాంధీ తనకు ఎంతో ఇష్టమైన పాస్తాను ఇంట్లోనే వండుకునేందుకు పాస్తా మేకర్ మెషీన్‌ను తెప్పించుకుందట. అదే పాస్తా మేకింగ్ మెషీన్‌లో పెట్టి కీలక డాక్యుమెంట్లను ధ్వంసం చేసినట్లు పుస్తకంలో రాసారు. మరి ఆ రచయిత్రికి ఈ విషయం ఎవరు చెప్పారు అనే అనుమానం మీకు రావచ్చు.
ఇందిర అరెస్ట్ సమయంలో ఇంట్లో ఉన్న పనివాళ్లు పాస్తా మేకింగ్ మెషీన్‌లో డాక్యుమెంట్లు వేసి ధ్వంసం చేసింది అని మాట్లాడుకుంటుంటే అది ఆ నోటా ఈ నోటా పాకి మీడియా చెవిన పడిందట. అయితే.. 1978లో ఇందిర మళ్లీ అరెస్ట్ అయ్యారు. ఆమెను తిహార్ జైలుకు తరలించారు. ఇది ఇందిరకు సానుభూతిగా మారి 1980లో భారీ మెజార్టీతో మళ్లీ ప్రధాన మంత్రిగా పదవిని చేపట్టారు.
ఇప్పుడు ఇందిరా గాంధీ చర్చ ఎందుకు బయటికి వచ్చిందంటే.. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటిపై ఈడీ దాడులు జరిగిన సమయంలో ఆమె కీలకమైన డాక్యుమెంట్లను ఓ సూట్‌కేసులో తరలిస్తున్న ఫోటోలు బయటికి వచ్చాయి. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఆమె కూడా ఇందిర లాగే కీలక ఆధారాలను ధ్వంసం చేసారనే టాక్ నడుస్తోంది.





