Tirumala: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం రేపుతున్నాయి. ప్రత్యేక దర్శన టికెట్లు రూ.300 అంటూ నకిలీ టికెట్లు అమ్మేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అలా నకిలీ టికెట్లు కొన్నవారు దర్శనానికి వస్తుంటే చూసి పట్టుకోవాల్సిన పోయి అక్కడ పనిచేస్తున్న ప్రైవేటు సిబ్బంది వారిని దర్శనానికి అనుమతించడం సంచలనంగా మారింది. నకిలీ టికెట్ల తయ్యారిలో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బంది హస్తం ఉన్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు అనుమానిస్తున్నారు.
అసలు తిరుమలలో ఉన్నట్టుండి ఏం జరుగుతోందో ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. మొన్నటివరకు తిరుమల అనగానే శ్రీవారి దర్శనం.. లడ్లు.. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం ఇవే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు. మొన్న జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం.. ఆ తర్వాత లడ్డూ కౌంటర్‌లో కంప్యూటర్ సిస్టమ్ నుంచి మంటలు రావడం.. ఆ తర్వాత ఘాట్ రోడ్డులో తిరుమల బస్సు డివైడర్‌ను ఢీకొని పలువురికి గాయాలు కావడం వంటివి జరిగాయి. దాంతో అసలు తిరుమలపై ఎవరి కన్ను పడిందో.. శ్రీవారేమైనా ఆగ్రహించారేమో అని భక్తులు చర్చించుకుంటున్నారు.
తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలను నాశనం చేసింది.. శ్రీవారిని కూడా వదల్లేదు అని ఎన్నో మాటలు అన్నారు. మరి ఇప్పుడు ఏం జరుగుతోంది. అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వమే కదా. మరి తిరుమలలో నకిలీ టికెట్లు ఎవరు అమ్ముతున్నట్లు? దీనిపైన ఎందుకు చర్చ జరగడం లేదు?