Dog Bite: సాధారణంగా మనిషిని కుక్క కరిస్తే వెంటనే రేబీస్ వ్యాక్సినేషన్ వేయించుకుంటారు. కానీ ఈ ఘటనలో మాత్రం.. కుక్క ఓ గేదెని కరిస్తే ఊరు ఊరంతా వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ నెల 23న బదౌ గ్రామంలో ఓ వర్గానికి చెందిన వారు ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని వారంతా రకరకాల వంటలు చేసుకున్నారు. ఆ వంటలో రైతా కూడా ఉంది. అయితే.. ఆ గ్రామంలోని ఓ గేదెను కుక్క కరిచిందట. ఆ తర్వాత దానికి రేబీస్ లక్షణాలు బయటపడి అది చనిపోయింది.
అయితే.. అప్పటివరకు ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గేదె చనిపోయాక ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఎందుకంటే వంటల్లో వండిన రైతా కోసం పిండిన పాలల్లో ఆ చనిపోయిన గేదె నుంచి కూడా పిండిన పాలు ఉన్నాయి. ఆ గేదె చనిపోవడంతో దాని పాల నుంచి తయారుచేసిన రైతా అందరూ తినడంతో తమకు కూడా రేబీస్ సోకే ప్రమాదం ఉందని భావించి భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని ఊరి పెద్దకు చెప్పడంతో ఆయన స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కి వెళ్లి విషయం చెప్పారు. వారు వెంటనే ఊరు మొత్తానికి రేబీస్ వ్యాక్సిన్ వేయించారు.
అయితే.. ఆ గేదె పాల నుంచి రైతా చేసినప్పటికీ పాలు వేడి చేసి.. తోడు వేసి చేసిన పెరుగుతో తయారు చేసారు కాబట్టి రేబీస్ సోకే అవకాశం లేదని.. కానీ జనాలు భయంతో వణికిపోతుండడంతో రిస్క్ ఎందుకున్న ఉద్దేశంతో అందరికీ వ్యాక్సిన్ వేసామని స్థానిక అధికారులు తెలిపారు.





