Nagarjuna Konda Surekha Issue: తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. సినీ నటుడు నాగార్జున కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వల్లే అక్కినేని నాగచైతన్య, సమంతలు విడిపోయారని.. ఆయన వల్ల మరో నటి టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేసి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానించారు. ఇదేదో మరో రాజకీయ విమర్శలా తీసుకుంటారని కొండా సురేఖ అనుకున్నారు కానీ విషయం కోర్టు వరకు వెళ్లింది.
నాగార్జున సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసారు. KTR కూడా కేసు వేసారు. కొన్ని నెలల పాటు ఈ కేసు నాంపల్లి హైకోర్టులో నడిచింది. ఆ తర్వాత ఇటీవల కొండా సురేఖ మరోసారి ఎక్స్ వేదికగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని.. నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. దాంతో నాగార్జున కూడా కేసు వెనక్కి తీసుకున్నారు.
ఇక్కడతో విషయం సర్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో ఓ కొత్త వాదన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి నాగార్జున కేసు వెనక్కి తీసుకోవడానికి కారణం దర్శకుడు రామ్ గోపాల్ వర్మేనట. నాగార్జునకి వర్మ చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇది అందరికీ తెలిసిందే. వర్మకు కొండా సురేఖ దంపతులతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దాంతో కేసు వెనక్కి తీసుకుంటే బాగుంటుందని వర్మ నాగార్జునకు నచ్చజెప్పడంతోనే ఈ వివాదానికి తెరపడిందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
నాగార్జున వర్మ కాంబినేషన్లో వచ్చిన శివ సినిమాను రీరిలీజ్ చేయాలనుకుంటున్న సమయంలో వీరిద్దరూ చాలా సార్లు కలిసారని.. ఆ సమయంలోనే కేసు వాపసు తీసుకోవడం అనే అంశంపై కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది. రీరిలీజ్ సమయంలో ఎలాంటి వివాదాలు వద్దు అని వర్మ నాగ్‌కు సూచించినట్లు సమాచారం. ఈ రూమర్స్‌పై వర్మ కానీ నాగ్ కానీ స్పందించలేదు.





