Tirumala: ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి రెండు ఘటనలు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి బాగా వైరల్ అవుతున్నది.. ముగ్గురు భక్తులు చెప్పులు వేసుకుని ఆలయంలోకి వచ్చేసారట. బంగారు వాకిలికి కొద్ది దూరంలోనే సెక్యూరిటీ గార్డు చూసి ఆ చెప్పులు విప్పండి అని మందలించడంతో వారు అక్కడే వదిలేసి దర్శనానికి వెళ్లిపోయారు. చూడటానికి ఆ భక్తులు నార్త్ ఇండియన్స్‌లా ఉన్నారు.
సరే.. ఈ విషయాన్ని పక్కన పెడితే.. అసలు ఎంట్రీ గేటు దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డు వారు చెప్పులు వేసుకుని రావడం చూడలేదా? టికెట్లు, ఆధార్ కార్డు చెక్ చేసేవారు చూడలేదా? దాదాపు మూడు చెకింగ్ పాయింట్స్ దాటితే తప్ప భక్తులు వెండి వాకిలి వద్దకు చేరుకోలేరు. మరి ఏ ఒక్కరూ చూడలేదా? కనీసం లైనులో ముందు లేదా వెనుక నిలబడిన వారు కూడా చెప్పలేదా? కచ్చితంగా చెప్పే ఉంటారు. అయినా వాళ్లు చెప్పులు విప్పకుండా బంగారు వాకిలి దాకా ఎలా వెళ్లగలిగారు అన్న సందేహం కలగక మానదు. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. వాళ్లు వేసుకుంది చెప్పులు కాదు. హోటల్స్‌లో ఇచ్చే పేపర్ ఫుట్‌వేర్. అంటే వీటిని పేపర్, వస్త్రంతో తయారు చేస్తారు.
స్నానం చేసి వచ్చాక కాళ్లకు దుమ్ము అంటకుండా వీటిని ధరిస్తారు. బహుశా వాళ్లు కూడా సెక్యూరిటీ సిబ్బందితో.. అడిగిన వారితో ఇదే చెప్పి ఉంటారు. అందుకే ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చు. కానీ తలలో పువ్వులు పెట్టుకున్నా.. జుట్టు విరబోసుకున్నా వెంటనే సిబ్బంది మందలిస్తారు. అలాంటిది ఈ భక్తులు పేపర్ చెప్పులు వేసుకుని బంగారు వాకిలి దాకా వచ్చేసారంటే తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ఏం చేస్తున్నట్లు?
నైవేద్యం ఆలస్యం
ఇక ఈరోజు తిరుమలలో జరిగిన అపచారాల్లో రెండోది.. శ్రీవారికి ఆలస్యంగా నైవేద్యం పెట్టడం. వసంతోత్సవంలో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను తరలించిన నేపథ్యంలో నైవేద్యం తీసుకెళ్తుండగా అక్కడి గేటుకు తాళాలు వేసి భద్రతా సిబ్బంది వెళ్లిపోయారు. దాంతో వాళ్లు వచ్చి తాళం తీసేవరకు అర్చకులు ఎండలోనే 15 నిమిషాలు నిలబడ్డారట. ఈ ఘటన వల్ల స్వామివారికి నైవేద్యం ఆలస్యంగా పెట్టారట.