Chollangi Amavasya: పుష్య మాసంలో వచ్చే చివరి అమావాస్యను చొల్లంగి అమావాస్య అని మౌని అమావాస్య అని అంటారు. ఈ పుష్య మాసంలో చివరి అమావాస్య జనవరి 29న వచ్చింది. కాబట్టి ఆ రోజున చొల్లంగి అమావాస్యగా జరుపుకుంటారు. ఇంతకీ చొల్లంగి అమావాస్య అంటే ఏంటి? ఆ రోజున ఏం చేయాలి? వంటి విషయాలను తెలుసుకుందాం. చాలా శక్తిమంతమైన విశేషమైన అమావాస్య. మనకు విష్ణు సహస్రనామాల్లోని ఓ నామంలో ఆ నామాన్ని నిరూపించడానికి విష్ణు మూర్తి భూమి మీద వైద్య వీరరాఘవస్వామి అనే స్వరూపంతో అవతరించిన అద్భుతమైన రోజు. ఆ రోజుకి ఉన్న ప్రత్యేకమైన శక్తి ఏంటంటే రోగ హరం. కుటుంబంలో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు, రోగాలు, మానసిక వ్యాధులు ఉంటే ఈ చొల్లంగి అమావాస్య రోజు వైద్య వీరరాఘవ స్వామిని ఆరాధిస్తే మంచానపడిన వ్యక్తి కూడా లేచి కూర్చునేంత శక్తి వస్తుందట.
వీర రాఘవస్వామిని ఎలా ఆరాధించాలి?
వీర రాఘవస్వామిని మూడు పనులతో ఆరాధించగలిగితే ఎంతో మంచిది. ఆ మూడు పద్ధతులు ఏంటంటే.. మొట్టమొదట చొల్లంగి అమావాస్య రోజున స్వామిని ఆరాధించడానికి ముందు వైద్య వీరరాఘవ స్వామి ఫోటోని పూజా మందిరంలో పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే.. బియ్యం పిండి, పంచదారను పొడిలా చేసి ఆ రెండూ కలిపి అందులో యాలకుల పొడి కలపాలి. ఒక చిన్న పళ్లెంలో వేసి చిన్న గుంట లాగా చేసి అవు నెయ్యి వేసి అందులో దీపం పెట్టాలి. ఇది మొదటి పని. తర్వాత ఏం చేయాలంటే.. ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయనుకోండి వాళ్లకి వెండితో ఒక కడియం చేయించండి.
స్వామి ముందు కూర్చుని సంకల్పించి.. నీ దయ వల్ల ఈ వ్యాధి తగ్గి మాకు స్వస్థత చేకూరితే తిరువళ్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం. ఈ కడియాన్ని అక్కడి హుండీలో వేస్తాం అని సంకల్పం చేసుకోండి. అప్పుడు స్వామికి పూజ చేయండి. విష్ణు సహస్ర నామాలు చదువుతూ పూజ చేస్తే సరిపోతుంది. ఆరోజున చేయాల్సిన మూడో పని ఏంటంటే.. మీ ఇంటి దగ్గర్లో చెరువు, బావి ఉందనుకోండి అక్కడికి వెళ్లి మీ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది ఒక బెల్లం ముక్క అందులో వేయాలి. ఒకవేళ మీ ఇంటి దగ్గర చెరువు, బావి లేవనుకోండి.. మీరే ఏదైనా చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకుని అందులో వేసినా సరిపోతుంది. Chollangi Amavasya
ఆ నీటికి ప్రదక్షిణ చేసి తిరువళ్లూరులో ఉన్న పుష్కరిణి చేస్తున్నాం అన్నట్లు సంకల్పించి అందులో బెల్లం ముక్క వేయాలి. ఇలా ఆ స్వామిని ఆరాధించాలి. ఆ తర్వాత పూజంతా అయిపోయాక దీపం కొండెక్కేసాక ఆ పిండి అంతా కలిపేసి చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ ప్రసాదంలా స్వీకరించాలి. తర్వాత వ్యాధి తగ్గాక కానీ కాస్త ఊరట వచ్చాక కానీ తిరువళ్లూరు వెళ్లి వీర రాఘవస్వామి హుండీలో ఆ కడియం వేసేయండి. అక్కడితో మీ మొక్కు తీరిపోయినట్లే. ఇలా పూజ చేసిన వాళ్లల్లో కొన్ని లక్షలాది మందికి ఎన్నో వ్యాధులు తగ్గాయి.
ఈ తిరువళ్లూరు ఎక్కడుంది?
చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు 108 దివ్య దేశాల్లో ఉన్నాయి. అందులో తిరువళ్లూరు ఒకటి. చెన్నై నుంచి అరక్కోణం వెళ్తూ ఉంటే దారిలో వస్తుంది ఈ తిరువళ్లూరు. ఈ క్షేత్రం ప్రతి అమావాస్య రోజు యాక్టివేట్ అవుతుంది. ఆరోజున వేలాది మంది భక్తులు వస్తుంటారు. చొల్లంగి అమావాస్య రోజున ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని సంతరించుకుంటుంది. పూజ చేసినంత మాత్రాన రోగాలు నయమైపోతాయా అని వితండవాదం చేసేవారు.. ఆ క్షేత్రానికి వచ్చే వారిలో ఎవరినైనా అడిగి చూడండి. వారిలో ప్రతి ఒక్కరు ఏదో ఒక రోగం నుంచి బయటపడిన వారే ఉంటారు. అక్కడి జనం ఏం చేస్తూ ఉంటారంటే.. హృద్పాపనాశిని అనే పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో బెల్లం వేసి స్వామికి నమస్కారం చేస్తుంటారు. Chollangi Amavasya
పుష్కరిణి గొప్పతనం ఏంటి?
ఎన్నో వేల ఏళ్ల నాటి నుంచి ఉన్న పుష్కరిణి. దక్ష యజ్ఞం కథలో పరమేశ్వరుడు వీరభద్రుడి స్వరూపంలో వచ్చి దక్షుడిని సంహరించారు కదా.. ఆ తర్వాత స్వామి చింతా క్రాంతుడైయ్యాడు. ఎందుకంటే దక్షుడు బ్రహ్మమాంస పుత్రుడు. బ్రహ్మ హత్య దోషం ఉంటుంది కదా.. దాంతో స్వామి బాధపడుతూ ఉంటే అప్పుడు అశరీరవాణి స్వామి అక్కడికి వెళ్లి స్నానం చేయండి ఊరట చెందుతారు అని చెప్తుంది. అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుడి స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపూర్వమైన పుష్కరిణి అది. అందుకే ఇప్పటికీ ఆ క్షేత్రానికి వెళ్తే తూర్పు వైపు వీరభద్రుడి ఆలయం ఉంటుంది. స్వామి అక్కడికి వచ్చి స్నానం చేసాక ఆయన చింతలు తీరిపోయాయని చెప్తారు. మానసిక, శారీరక వ్యాధులున్నా ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే నయం అయిపోతాయి. Chollangi Amavasya
మరి క్షేత్రం ఎలా వచ్చింది?
విష్ణుమూర్తి ఒక లీలా నాటకం ఆడారన్నమాట. అదేంటంటే.. బదరికా ఆశ్రమంలో శాలిహుద్రుడు అనే మహర్షి ఉండేవారు. ఆయన విష్ణు మూర్తి అంశతోనే జన్మించాడు. ఆయన ఒకసారి దక్షిణ భారతదేశానికి యాత్రకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆ హృద్పాపనాశినిలో స్నానం చేసాక ఆహా ఇక్కడ ఎంత బాగుంది.. ఇక్కడ ఉపవాస దీక్ష చేసి ఒక సంవత్సరం పాటు తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు దీక్ష పట్టి సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు చేసాడు. సంవత్సరం పూర్తయ్యాక ఇక దీక్ష విరమిద్దామని చెప్పి కొంచెం ఆహారం తెచ్చుకున్నాడు. సరిగ్గా ఆయన తినే సమయానికి ఓ వృద్ధుడు వచ్చి నాయనా ఆకలేస్తోంది ఆ ఆహారం నాకు ఇవ్వవా అని అడిగాడు.
వచ్చింది విష్ణు స్వరూపం ఏమో అనుకుని ఆ ఆహారం ఇచ్చేస్తాడు. దాంతో ఆయన దీక్ష విరమించలేకపోయాడు. అప్పుడు ఆ మహర్షి ఏమనుకున్నారంటే.. మరో సంవత్సరం పాటు దీక్ష చేయాలని అనుకున్నారు. అలా మళ్లీ దీక్ష మొదలుపెట్టి సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు చేసాడు. సంవత్సరం పూర్తయ్యాక దీక్ష విరమించాలనుకుని ఆహారం తెచ్చుకోగా మరో వ్యక్తి వచ్చి నాయనా ఆకలేస్తోంది ఆ ఆహారం నాకు ఇవ్వవా అని అడుగుతాడు. మనమైతే పక్కకుపో అని కసురుకుంటాం. కానీ ఆ మహర్షి అలా చేయలేదు. వెంటనే ఆహారం ఇచ్చేసాడు. అప్పుడు స్వయంగా విష్ణుమూర్తే ప్రత్యక్షమయ్యి ఎందుకు ఈ తపస్సు ఎందుకీ నిరాహార దీక్ష.. నీకు ఏం కావాలో చెప్పు ఇస్తాను అంటాడు. అప్పుడు ఆ మహర్షి నాకేం కోరికలు ఉంటాయి స్వామి ఇదంతా నేను లోకకళ్యాణం కోసం చేస్తున్నాను అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఆశ్రమంలో పవనిస్తున్న రూపంలో వెలిసారు. అదే ఈ వీరరాఘవ స్వామి ఆలయం. Chollangi Amavasya
ఈ క్షేత్రానికి అమ్మవారు ఎలా వచ్చారు?
ఆ ప్రాంతాన్ని ధర్మసేన మహారాజు పాలించేవాడు. ఆయనకి వసుమతి అనే కూతురు ఉంది. మహా సౌందర్యవతి. ఒకసారి చెలికత్తెలతో ఈ హృద్పాపనాశిని దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక రాజకుమారుడు కనిపిస్తాడు. ఆయన కూడా ఎంతో అందంగా వెలిగిపోతుంటారు. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు ఇష్టపడతారు. అప్పుడు ఆయన మనం వివాహం చేసుకుందామా అని అడుగుతారు. అప్పుడు వసుమతి.. మా నాన్నగారిని అడగండి. ఆయన ఒప్పుకుంటే చేసుకుందాం అంటుంది. అలా ఆ రాజకుమారుడు వసుమతి తండ్రి ధర్మసేన దగ్గరికి వెళ్లి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి కంటికి రెప్పలా చూసుకుంటాను అంటాడు.
అప్పుడు ధర్మసేన ఎవరు నాయనా నువ్వు నీ గోత్రం ఏంటి అని అడుగుతారు. అప్పుడు అతను తానొక రాజకుమారుడినని.. వసుమతిని తనకు ఇచ్చి పెళ్లి చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని.. వసుమతికి అంతా నీరాజనం చేసే రోజులు వస్తాయని అంటాడు. అప్పుడు ఆ ధర్మసేన ఆ అందగాడిని చూసి పెళ్లికి ఒప్పుకుని ఘనంగా జరిపిస్తాడు. ఆ తర్వాత వారిద్దరూ చేయి పట్టుకుని ఓ క్షేత్రంలోకి నడుచుకుంటూ వెళ్తూ మాయం అయిపోతారు. అప్పుడు ఆ ధర్మసేనకు అర్థమవుతుంది.. తనకు బిడ్డ వసుమతి ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవే అని. ఎంత విచిత్రం చూసారా.. ఆ రాజకుమారుడు ఎవరో కాదు విష్ణుమూర్తే. అలా లక్ష్మీదేవి కూడా ఈ తిరువళ్లూరు క్షేత్రంలో వసుమతిగా వెలిసింది. ఈ వీరరాఘవ స్వామి విగ్రహాన్ని మీరు సరిగ్గా గమనించినట్లైతే ఆయన తల కింద ఓ మందుల పెట్టె ఉంటుంది. అంటే ఆయన రోగాలను నివారించే వైద్యుడు అని అర్థం. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజు ఇలా పూజ చేసి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. Chollangi Amavasya