Cashews: ఓ వాహనం నుంచి వెలువడే వేడిని తగ్గించేందుకు కూలెంట్ ఎలాగైతే ఉపయోగపడుతుందో.. మన బుర్ర హీటెక్కినప్పుడు జీడిపప్పు కూలెంట్‌గా వ్యవహరిస్తుందని తెలుసా? ఇప్పుడున్న మన లైఫ్‌స్టైల్‌లో మనసు, మెదడు ప్రశాంతంగా ఉండటం అనేది దాదాపు అసాధ్యంగా మారిపోయిన పరిస్థితి. ఒత్తిడి కారణంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి జీవితాలు తలకిందులైపోతున్నాయి. మెదడు బాగా పనిచేయాలన్నా.. క్లియర్‌గా క్లారిటీగా ఆలోచించగలిగేలా చేయాలన్నా జీడిపప్పు చేదోడుగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఎందుకంటే జీడిపప్పులో ఎల్ ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ మెదడును చల్లబరిచేలా చేస్తుంది. ఈ ఒక్క అమైనో యాసిడ్ వల్ల హ్యాపినెస్ హార్మోన్ అయిన సెరోటొనిన్, నిద్రకు సాయపడే హార్మోన్ అయిన మెలాటొనిన్ ఉత్తేజితమవుతాయి. సెరోటొనిన్ పెరిగితే మెదడు ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెడుతుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆ మెగ్నీషియం పుష్కలంగా జీడిపప్పులో దొరుకుతుంది. కాబట్టి నాలుగైదు జీడిపప్పులు తింటే మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జీడిపప్పు మెదడుకు ఊపిరిలాంటిందని నిపుణులు చెప్తున్నారు.





