Eyebrow Threading: ఐబ్రో థ్రెడింగ్ అనేది సహజంగా ఆడవాళ్లు చేయించుకునే ప్రక్రియే. నెలలో రెండు సార్లు కచ్చితంగా పార్లర్‌కు వెళ్లి చకచకా ఐబ్రో థ్రెడింగ్ చేయించుకుంటూ ఉంటారు. కనుబొమ్మలతో పాటు పెదవులపై, చెంప దగ్గర ఉండే రోమాలను కూడా తీయించుకుంటూ ఉంటారు. అయితే.. ఇలా ఐబ్రో థ్రెడింగ్ చేయించుకోవడం వల్ల Hepatitis B సోకి కాలేయం పాడైపోతుంది అంటే నమ్ముతారా? దానికి దీనికి సంబంధం ఏంటి అని కొట్టిపారేస్తారు. అయితే.. ఐబ్రో థ్రెడింగ్ వల్ల హెపటైటిస్ వస్తుంది అని చెప్పడం లేదు కానీ ఒక 28 ఏళ్ల యువతికి వచ్చింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఏముంది.. పార్లర్‌లో ఆల్రెడీ థ్రెడింగ్‌కి వాడేసిన దారాన్ని మళ్లీ మళ్లీ ఇతర కస్టమర్లపై వినియోగించడం వల్ల జరిగిన ఘోరం ఇది.
అసలేం జరిగింది?
అమితి ధమీజా అనే వైద్యురాలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం ఓ 28 ఏళ్ల యువతి విపరీతంగా నీరసం, కళ్లు పచ్చగా మారిపోవడం, వాంతులు అవుతున్నాయంటూ తనను సంప్రదించిందట. వెంటనే ఆమె బ్లడ్ టెస్ట్‌లు చేయగా.. Hepatitis B ఉందని తేలింది. అప్పటికే ఆ యువతి కాలేయం 85% పాడైపోయింది. ఇలా జరగడానికి కారణం ఏమై ఉంటుందా అని పరిశీలించి చూడగా.. ఆమె తరచూ వెళ్లే పార్లర్‌లో ఐబ్రో థ్రెడింగ్ చేయించుకునేదని.. అక్కడ ప్రొఫషనల్స్ వాడే దారం ఆల్రెడీ వాడేసినదే ఉండటంతో ఈ వ్యాధి సోకిందట.
అంటే.. ఆల్రెడీ Hepatitis B ఉన్న కస్టమర్‌కి వాడిన దారాన్ని ఈ 28 ఏళ్ల యువతికి కూడా వాడారు. ఇలా వాడేసిన పరికరాలు, వస్తువులను మరొకరు వాడినా Hepatitis B వస్తుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైనేషన్ కూడా ధృవీకరించింది. Hepatitis B వైరస్ అనేది వస్తువులపై కొన్ని రోజుల పాటు యాక్టివ్‌గానే ఉంటుంది. ఈ Hepatitis Bకి చికిత్స లేదు కానీ ఆ వైరస్‌ను యాక్టివ్‌గా ఉంచకుండా చేయగలిగే చికిత్సలు అయితే ఉన్నాయి. ఈ చికిత్స ద్వారా వైరస్ ఇతర అవయవాలకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది.
ప్రపంచంలో Hepatitis B అనేది అత్యంత సర్వసాధారణమైన లివర్ ఇన్‌ఫెక్షన్. ప్రపంచంలో 254 మిలియన్ మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ హెపటైటిస్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎక్యూట్, మరొకటి క్రోనిక్. ఎక్యూట్ అంటే ఇన్‌ఫెక్షన్ శరీరంలో 6 నెలల పాటు ఉంటుంది. సరైన చికిత్సలు తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉండదు. ఇక క్రోనిక్ అంటే జీవితాంతం ఈ వ్యాధితో బాధపడుతూనే ఉండాలి.