Baby born in karthika masam: కార్తీక మాసాన్ని మన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తాం. అశ్వయుజ శుద్ధ పౌర్ణమి తర్వాత వచ్చే ఈ నెలను శివుడు, విష్ణువుకు ప్రత్యేకమైనది అన్న విషయం మనకు తెలిసిందే. ఈ నెలలో గంగా నదిలో స్నానం, దీపారాధన, వనభోజనం వంటి ఆచారాలను పాటించడం విశేషం. కార్తీక మాసంలో చేసే పూజలు ఆచరించే పద్ధతుల వల్ల ఆధ్యాత్మిక శాంతి, ఆరోగ్య సౌఖ్యాన్ని తెచ్చిపెడతాయి.
అయితే.. కార్తీక మాసంలో పిల్లలు పుడితే మంచిదా కాదా అని చాలా మందికి ఓ సందేహం ఉంటుంది. కొందరేమో ఈ సమయంలో పిల్లలు పుడితే ఎంతో మంచిది అంతా శుభం జరుగుతుంది అంటారు. మరికొందరేమో.. కార్తీక మాసంలో పిల్లల్ని కంటే అరిష్టం అని చెప్తుంటారు. నిజానికి కార్తీక మాసంలో పిల్లలు పుడితే వారిపై శివుడు, విష్ణువు ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయంటారు. ఈ మాసంలో పుట్టే పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారట. వారు పెద్దయ్యాక కూడా సాత్విక జీవనాన్ని సాగించాలన్న ఆలోచనలతో ఉంటారని పెద్దలు చెప్తుంటారు.
కార్తీక మాసం ప్రత్యేకత
శివునికి విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలోఉపవాసం ఉండడం, సాయంత్రం దీపారాధన చేయడం, దానం చేయడం చాలా మంచిది. కార్తీక మాసం రోజుల్లో గంగానదిలో స్నానం చేయడం, లేదా సమీపంలో ఉన్న పవిత్ర నదుల్లో స్నానం చేయడం ద్వారా పాప విమోచనం కలుగుతుందని పురాణాలలో చెప్పారు.
కార్తీక దీపం పూజ, దీపారాధన
కార్తీక మాసంలో ప్రతి రోజు సాయంకాలం వేళ వెలిగించే దీపం చాలా ప్రత్యేకం. ఉసిరి కాయల్లో ఆవు నెయ్యి వేసి ప్రతి సోమవారం ప్రదోష వేళ అంటే.. సాయంత్రం వేళల్లో వెలిగిస్తే ఎంతో పుణ్యం. అనుకున్న కోరికలు కూడా తీరతాయని చెప్తుంటారు. ఈ దీపారాధన విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. దీపం వెలిగించడం ద్వారా ఆ ఇంట్లో చెడు శక్తులు తొలగిపోతాయని, భక్తులకి అదృష్టం, ఆయురారోగ్యాలను కలిగిస్తుంది.
వనభోజనాలు, క్షీరాభిషేకం
కార్తీక మాసం సమయంలో వనభోజనాలు, క్షీరాభిషేకం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి వనాలకు వెళ్ళి ప్రకృతితో ఆనందంగా గడపడం ఆరోగ్యానికి, మానసిక సౌఖ్యానికి కూడా మంచిదని భావిస్తారు. పాలతో విష్ణువు, శివుని ఆలయాల్లో చేసే అభిషేకాలు ఎంతో శక్తివంతమైనవి. మీకు ఒకవేళ ఈ అభిషేకం చేసే అవకాశం లేకపోతే కనీసం వీక్షించండి. ఎంతో మంచిది. (Baby born in karthika masam)
కార్తీక పౌర్ణమి, దాన మహిమ
కార్తీక పౌర్ణమి ఈ మాసంలో అత్యంత ప్రత్యేకమైన రోజు. ఈ రోజున గంగా స్నానం చేసి, పూజ చేసి, దీపారాధన చేయడం వల్ల అధిక పుణ్యం లభిస్తుంది. అలాగే.. ఆ రోజున పేదలకు దానం చేయడం ఎంతో మంచిది. దీపాలు వెలిగించి గంగా నదిలో వదలడం ద్వారా కర్మ విమోచన కలిగిస్తాయని పురాణాలలో చెప్పారు.
ఉపవాసం
కార్తీక మాసంలో చాలా మంది ఉపవాసం చేస్తుంటారు. దీనివల్ల మనశ్శాంతి, ఆధ్యాత్మిక శక్తి పెరగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదే. అలాగని ఉపవాసం ఉన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు విరమిద్దామా ఎప్పుడెప్పుడు ఆరగిద్దామా అనే ధ్యాసతో ఉండకూడదు. అలా ఉంటే ఏ ఫలితమూ ఉండదు. ఒకవేళ మీరు ఉపవాసం చేయలేకపోతే కనీసం వెల్లుల్లి, ఉల్లి, మాంసాహారానికి దూరంగా ఉంటే చాలు.