Anil Ravipudi: టాలీవుడ్‌లో దాదాపు అందరు టాప్ హీరోలతో సినిమాలు చేసారు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. అన్ని సినిమాలు హిట్లే. ఎందుకంటే ఆయన టార్గెట్ చేసేది ఫ్యామిలీ ఆడియన్స్‌ని. అందుకే ఇప్పుడున్న యువతకు అనిల్ రావిపూడి సినిమాలు రోత, క్రింజ్‌గా అనిపిస్తాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో కలిసి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో నయనతార హీరోయిన్. ఈ సినిమా ట్రైలర్, పాటలు ఇప్పుడున్న యువతకు ఎక్కలేదు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం చాలా నచ్చేసాయి.
ఈ సినిమాలోని మీసాల పిల్ల అనే పాట రిలీజ్ అయినప్పుడు ఇదేం దిక్కుమాలిన పాటరా బాబూ క్రింజ్ అని కామెంట్స్ చాలానే వచ్చాయి. దీనిపై అనిల్ స్పందిస్తూ.. ఈ క్రింజ్ అనే పదం తనను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని కానీ కేవలం 10% మంది మాత్రమే తన సినిమాలను క్రింజ్ అంటున్నారని మిగతా 90% మంది ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. ఆ పది శాతం మంది గురించి తనకు ఆలోచించాల్సిన అవసరం లేదని.. 90% మంది తన సినిమా పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తే అప్పుడు ఫీలవుతానని అన్నారు.
ఆయన చెప్పింది నిజమే కదా..! మాటకు ముందు మాట తర్వాత బూతు లేనిదే కామెడీ ఉండటంలేదు. ఇటీవల రిలీజైన కొన్ని సినిమాల్లో ఎంత అసభ్యకరమైన సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వస్తున్న సినిమాలను ఫ్యామిలీతో కలిసి చూసేలా ఎక్కడున్నాయ్? అందుకే అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారు. ఆయన సినిమాలు చూసి ఎంజాయ్ చేసే జనరేషన్ సోషల్ మీడియాలో లేరు. అందుకే ట్రోలింగ్స్‌కి అడ్డు అదుపు లేకుండా పోతోంది.






