Tammareddy Bharadwaj: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. జూన్ 12న విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు సినిమాను ఆడకుండా చేసేందుకు థియేటర్లను బంద్ చేయాలని కుట్రలు చేస్తున్నారని.. ఈ కుట్రల వెనుక ఆ నలుగురు ఉన్నారని వ్యాఖ్యానించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అలా పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేసారో లేదో.. ఇలా టాప్ నిర్మాతలు వెంట వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేసారు.
ఇప్పటికే అల్లు అరవింద్, దిల్ రాజులు మాట్లాడేసారు. పవన్ కళ్యాణ్ అంటున్న ఆ నలుగురిలో తాను లేనని.. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లను బంద్ చేయాలనుకోవడం దుస్సాసహమే అని ఆయన వ్యాఖ్యానించారు. మరోపక్క దిల్ రాజు కూడా మాట్లాడారు. పవన్ తనకు పెద్దన్న లాంటివారని.. ఆయన ఓమాటంటే తాను పడతానని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికైనా ఉందా అంటూ ఆయన కూడా వివరణ ఇచ్చేసుకున్నారు.
దీనిపై తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. పవన్ ఆ నలుగురు అనగానే అల్లు అరవింద్, దిల్ రాజు, సునీల్ నారంగ్ వంటి టాప్ నిర్మాతలు మీడియా ముందుకు వచ్చేసి ఆ నలుగురిలో తామే లేమని చెప్పేసుకున్నారని.. కానీ ఆ నలుగురిలో వీరంతా ఉన్నారని తమ్మారెడ్డి అన్నారు. అయితే.. ఆ నలుగురి మధ్య ఉన్న విభేదాలు కాస్తా ఇలా బయటికి వచ్చాయే తప్ప హరిహర వీరమల్లు సినిమాను ఆపేయాలన్న ఉద్దేశం మాత్రం కాదని ఆయన అన్నారు. ఏ పెద్ద హీరో సినిమాను కూడా తొక్కేసే ధైర్యం ఎవ్వరికీ లేదని అన్నారు.





