Svalbard చావు పుట్టుకలు లేని ప్రదేశం ఎక్కడైనా ఉంటుందా? చావు పుట్టుకలు లేకుండా మరి జనాభా 3000 ఎలా ఉంది? అనుకుంటున్నారా? అయితే ఈ వింత ప్రదేశం గురించి మీతో పంచుకోవాల్సిందే. ఈ ప్రదేశం పేరు స్వాల్బర్డ్. ఇదొక ద్వీపం. నార్త్ పోల్కు 1300 కిలోమీటర్ల దూరంలో నార్వేలో ఉంది. జనాభా 2500 నుంచి 3000 వరకు ఉంటారు. మరి చావు పుట్టుకలు లేకపోవడం ఏంటి?
ఇక్కడ పుట్టుకలు ఎందుకు ఉండవంటే.. ఈ స్వాల్బర్డ్ ప్రాంతంలో ఒక హాస్పిటల్ కాదు కదా చిన్న క్లీనిక్ కూడా లేదు. దాంతో గర్భిణులు డెలివరీకి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఏడో నెలలోనే వేరే ప్రాంతానికి వెళ్లి.. డెలివరీ అయ్యాక పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే తిరిగి ఇక్కడికి వస్తారు. మరి మరణాలు ఎందుకు లేవు అంటే.. స్వాల్బర్డ్ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. మృతదేహాలు కుళ్లిపోకుండా అలాగే ఉండిపోతాయి.
దాంతో రోగాలు వస్తాయన్న ఉద్దేశంతో అసలు ఈ ప్రాంతంలో ఎవ్వరినీ చావనివ్వరు. అదెలా కుదురుతుంది.. చావు అనేది చెప్పి వస్తుందా అని మీరు అడగచ్చు. కరెక్టే.. అందుకే అనారోగ్యంతో ఉన్నవారిని.. వృద్ధులను ముందుగానే వేరే ప్రాంతానికి పంపించేస్తారు. ఇక్కడ మనుషులంటే పోలార్ బేర్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. సరదాగా ఈ ప్రాంతం వదిలి బయటికి వెళ్లాలంటే ఆత్మ సంరక్షణ కోసం కచ్చితంగా చేతిలో రైఫిల్ ఉండాల్సిందే. ఈ 3000 మంది జనాభాలో దాదాపు 50కి పైగా దేశాలకు చెందిన వారున్నారు. తలుపులకు తాళాలు వేయరు. ఎందుకంటే క్రైం రేట్ చాలా అరుదు.
కాపలాకు ఆర్మీ కూడా ఉండదు. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన ఆర్కిటిక్ పక్షులు ఎక్కువ కాబట్టి పిల్లులని నిషేధించారు. ఎందుకంటే అవి పక్షుల వెంట పడి చంపేస్తుంటాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. స్వాల్బర్డ్ ట్రీటీలోని దేశాలకు చెందిన వారు వీసా లేకుండా ఈ ప్రాంతంలో ఉండచ్చు.. పని చేసుకోవచ్చు. ట్రీటీలోని దేశాల్లో మన భారత్ కూడా ఉంది. సింపుల్గా చెప్పాలంటే.. ఈ ప్రాంతంలో నివసించాలనుకుంటే ఆరోగ్యంగా యవ్వనంగా ఉన్నవారే ఉండాలి.





