Aamir Khan Marriage: బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సితారే జమీన్ పర్ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొంతకాలంగా ఆయన బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త గౌరీ స్ప్రాట్‌తో ప్రేమలో ఉన్నారు.
ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. అయితే.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అభిమానులు అడగ్గా.. నిజానికి తనకు గౌరీతో తన మనసులో ఎప్పుడో పెళ్లి అయిపోయిందని.. తాళి కడితేనే పెళ్లి అనే సిద్ధాంతాన్ని తాను నమ్మనని అన్నారు. ఇప్పుడు తామిద్దరం భార్యాభర్తలమే అని చెప్పారు. ప్రస్తుతానికి తాను గౌరీ కలిసే ఉంటున్నామని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.
1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్న ఆమిర్.. ఆమెతో 2002లో విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల కూతురు ఐరా ఖాన్‌కు వివాహం కూడా జరిపించారు. ఆ తర్వాత లగాన్ సినిమా సెట్‌లో కిరణ్ రావు అనే అసిస్టెంట్ డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి సరోగసీ ద్వారా ఆజాద్ అనే బాబు జన్మించాడు. 2021లో వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు.
మార్చిలో తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆమిర్.. తాను తన స్నేహితురాలు గౌరీతో ప్రేమలో ఉన్నట్లు తొలిసారి ప్రకటించారు. అప్పటికే తాము 18 నెలలుగా ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. 60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి గురించి ఆలోచించడం కాస్త కష్టంగా ఉన్నప్పటికీ.. తాను మాత్రం సిద్ధంగానే ఉన్నట్లు పేర్కొన్నారు.