Sitting for too long పొగతాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో.. ఎక్కువ సేపు కూర్చున్నా కూడా అంతే హాని అని వైద్యులు పదే పదే హెచ్చరిస్తున్నారు.
గంటల తరబడి.. అంటే రెండు గంటల పాటు కదలకుండా కూర్చున్నా ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, ముందస్తు మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
మనిషి శరీరం రోజంతా అటూ ఇటూ తిరుగుతూ.. కదులుతూ ఉండేలా తయారుచేయబడిందట. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మెటబాలిజం పడిపోతుంది.. పిర్రల భాగంలో రక్తప్రసరణ ఆగిపోయి అవయవాల చుట్టూ కొవ్వు చేరుతుంది.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ పడిపోతుంది. ఫలితంగా గుండెపోటు, డయాబెటిస్ టైప్ 2 వంటివి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.
నేను రోజూ గంట పాటు వ్యాయామం చేస్తాను.. ఎక్కువ సేపు కూర్చున్నా ఏం కాదు.. అనుకుంటే పొరపాటే అంటున్నారు. ఎందుకంటే ఒక గంట వ్యాయామం 7 నుంచి 8 గంటల పాటు కూర్చోవడాన్ని సరిచేసేయలేదు.
ఇలాంటి వాళ్లలోనే 50ల్లో రావాల్సిన రోగాలు 30 ఏళ్లకే కనిపిస్తున్నాయని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం కూడా ఒక రోగమే. ఆ రోగం పేరు సిట్టింగ్ డిసీజ్.
మరి ఏం చేయాలి?
ప్రతి అరగంటకు లేచి ఓసారి నడుం విరుచుకోండి. కాసేపు అటూ ఇటూ తిరగండి. కుదిరితే కాఫ్ రైసెస్ (Calf Raises) చేయండి.
వర్క్‌లో ఉన్న ఫోన్ వస్తే అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడండి.
మీ ఆరోగ్యాన్ని బట్టి కార్యాలయాల్లో లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించండి.
ఒకవేళ మీ ఆఫీస్ నాలుగు లేదా ఐదో ఫ్లోర్‌లో ఉంటే కనీసం మూడో అంతస్తు వరకు మెట్లు ఎక్కి అక్కడి నుంచి లిఫ్ట్ ఎక్కండి.





