Sarabjit Kaur పాకిస్థానీని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిన ఓ భారతీయ మహిళకు సంబంధించిన అనధికారిక ఆడియో క్లిప్ ఒకటి వైరల్‌గా మారింది. ఆ ఆడియోలో తనను పాకిస్థాన్‌లో వేధిస్తున్నారని.. దయచేసి భారత్‌కు తీసుకురావాలని వేడుకుంటున్నట్లుగా ఉంది. వివరాల్లోకెళితే… పంజాబ్‌కి చెందిన సరబ్జీత్ కౌర్ అనే వివాహిత గతేడాది నవంబర్‌లో గురునానక్ జయంతి సందర్భంగా తీర్థయాత్రలో పాల్గొనేందుకు పాకిస్థాన్‌కు వెళ్లిందట. దాదాపు 2000 మంది భక్తులు ఈ యాత్రకు వెళ్లారు. వారిలో సరబ్జీత్ ఒకరు. అయితే తీర్థయాత్రను ముగించుకుని అందరూ భారత్‌కు తిరిగి వచ్చేసారు కానీ సరబ్జీత్ మాత్రం అక్కడే ఉండిపోయింది.
ఆ తర్వాత సరబ్జీత్ ఇంట్లో వారు భారత పోలీసులు ద్వారా ఆరా తీయించగా.. ఆమె ఇస్లాం మతం పుచ్చుకుని అక్కడే నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఒక అనధికారిక ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఆ ఆడియోలో పంజాబ్‌లో తన పిల్లలను మిస్సవుతున్నానని.. తనకు ఉద్యోగం లేదని.. తనను టార్చర్ పెడుతున్నారని ఉంది. అంతేకాదు.. చాలా మంది అనుకుంటున్నట్లు తాను గూఢచర్యం చేసేందుకు పాక్‌కు వెళ్లలేదని.. నాసిర్ హుస్సేన్ వద్ద తన నగ్న ఫోటోలు ఉన్నాయని.. పాక్‌కి వస్తేనే అవి ఇస్తానని చెప్పడంతో తీర్థయాత్ర పేరిట పాక్‌కి వెళ్లి అతన్ని కలిసానని అంటోంది. అతను బలవంతంగా తనను మతం మారేలా చేసి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ఆ తర్వాత తామిద్దరం కోర్టుకి వెళ్లి విడాకులకు దరఖాస్తు చేసుకున్నామని.. తనను మహిళా సంరక్షణ కేంద్రంలో ఉంచారని త్వరగా భారత్‌కు తీసుకెళ్లేలా చూడాలని ఆడియోలో ఉంది.
అయితే.. కొన్ని నెలల క్రితం ఈ సరబ్జీత్ నుంచి ఓ వీడియో బయటికి వచ్చింది. అందులో తాను ఇష్టంతోనే నాసిర్‌ను పెళ్లి చేసుకున్నానని.. తాను అతనితో సంతోషంగా ఉన్నానని.. పాకిస్థాన్ పౌరసత్వానికి కూడా దరఖాస్తు చేసుకున్నానని తెలిపింది. దాంతో విదేశాంగ శాఖ అధికారులు ఈ కేసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.





