YS Sharmila: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని అన్నారు APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ. నేషనల్ హెరాల్డ్ అక్రమ కేసుపై ఢిల్లీ కోర్టు నరేంద్ర మోదీకి, భారతీయ జనతా పార్టీకి చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై షర్మిళ స్పందించారు. నీచాతి నీచ రాజకీయాలకు చెంపపెట్టు. ధర్మపీఠం ముందు ప్రతీకారానికి చోటు లేదని నిరూపణ జరిగింది. కక్ష్య సాధింపు రాజకీయాలకు స్థానం లేదని తేటతెల్లం అయ్యింది. ఆకాశం లాంటి కాంగ్రెస్ పార్టీపై ఏదో వేయాలని చూస్తే చివరకది మోడీ మొహం మీదే పడింది.
ED నీ బానిసగా చేసుకొని, కాంగ్రెస్ అధినాయకత్వంపై బురద చల్లాలని చూసినా, గాంధీ కుటుంబాన్ని వేధించాలని కుట్రలు పన్నినా అంతిమగా న్యాయమే గెలిచింది. వ్యవస్థలను సొంతానికి వాడుకుంటున్నట్లు మరోసారి వాస్తవం రుజువైంది. ఇది అధర్మం అంతానికి, మోడీ గారి నిరంకుశత్వానికి చరమగీతం. స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను దుర్వినియోగం చేసినందుకు, కాంగ్రెస్ పార్టీపై అపఖ్యాతి మోపాలని చూసినందుకు, నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వెంటనే పదవులకు రాజీనామా చేయాలి. అని వెల్లడించారు.





