Varanasi: సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్ఠాత్మక వారణాసి సినిమాకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి షాక్ తగిలింది. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న ఎస్ఎస్ రాజమౌళికి నోటీసులు పంపారు. వారణాసి టైటిల్ కాపీ రైట్స్ రాజమౌళి వద్ద లేవని నోటీసులో పేర్కొన్నారు.
దాంతో రాజమౌళి నిర్మాతల కౌన్సిల్‌తో బేరసారాలు చేస్తారా లేదా SS Rajamouli‘s Vaaranasi అని టైటిల్ మారుస్తారా అనే చర్చ జరుగుతోంది. రాజమౌళి సినిమాలకు టైటిల్ కాంట్రొవర్సీలు కొత్తేం కాదు. ఆయన ఏదన్నా సినిమా తీయాలనుకోవడం.. ఆ తర్వాత గ్రాండ్‌గా ఈవెంట్ ఏర్పాటుచేసి టైటిల్ అనౌన్స్ చేయడం.. ఆ టైటిల్ నాది రాజమౌళి తస్కరించారు అంటూ ఎవరో ఒకరు కేసు వేయడం.. ఇవన్నీ జక్కన్నకు షరా మామూలే. గతంలో రాజమౌళి సినిమాలు, టైటిల్స్ ఎదుర్కొన్న సమస్యలేంటో ఓ లుక్కేద్దాం.
బాహుబలి (Baahubali)
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ సినిమాకు కూడా టైటిల్ సమస్యలు తప్పలేదు. ఒక రచయిత ఈ సినిమా కథ, టైటిల్ తనదని రాజమౌళి అనుమతి తీసుకోకుండా కాపీ కొట్టారని కోర్టుకెక్కాడు. కొన్ని నెలల పాటు ఈ కేసు కోర్టులో నడిచింది. ఆ తర్వాత రాజమౌళి అన్నీ క్లియర్ చేసుకుని సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసారు. 2013 నుంచి 2014 వరకు ఇది పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
ఈగ (Eega)
నేచురల్ స్టార్ నాని, సమంతలతో తీసిన ఈ విభిన్నమైన సినిమా బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్‌ని కూడా తెగ ఆకర్షించింది. అయితే.. ఈ సినిమాను తెలుగులో ఈగ అని తీసినప్పటికీ తమిళంలో నాన్ ఈ (Naan Ee), మలయాళంలో ఈచ (Eecha), హిందీలో ఫ్లై (Fly) అనే టైటిల్స్ అనుకున్నారట. కానీ కొన్ని చిత్ర పరిశ్రమల్లో ఈ టైటిల్స్ ఆల్రెడీ రిజిస్టర్ అవడం వల్ల ఈగ, మక్కి టైటిల్స్‌తో సరిపెట్టుకున్నారు. ఈ టైటిల్స్ కన్‌ఫ్యూజన్ వల్ల అప్పట్లో ప్రోమో ప్లానింగ్ కూడా చాలా లేటయ్యింది.
మగధీర (Magadheera)
రామ్ చరణ్, కాజల్ నటించిన మగధీర్ సినిమాకు కూడా సమస్యలు వచ్చాయి. అయితే టైటిల్ విషయంలో సమస్యలు రాలేదు కానీ స్టోరీ విషయంలో ఓ రచయిత ఈ కథ తనదేనంటూ రచ్చకెక్కారు. కానీ కోర్టు రాజమౌళికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అంతా సర్దుమణిగింది.
RRR
RRR సినిమా విషయంలోనూ జక్కన్నకు ఇబ్బందులు తప్పలేదు. నాటు నాటు పాటతో ఆస్కార్ గెలిచిన ఈ సినిమాకు మొదట రాజమౌళి రౌద్రం రణం రుధిరం, రైజ్ రోర్ రివోల్ట్, రామ రౌద్ర రుషితం అనే టైటిల్స్ అనుకున్నారు. కానీ ఇవన్నీ వేరే ఇండస్ట్రీల్లో రిజిస్టర్ అయ్యుండడంతో RRR టైటిల్‌కే పరిమితమయ్యారు.
విక్రమార్కుడు (Vikramarkudu)
ఈ సినిమాను రవితేజతో రాజమౌళి తీస్తున్నప్పుడే ఒక క్లాసిక్ సినిమాకు టైటిల్ రిజిస్టర్ అయ్యుంది. దాంతో రాజమౌళి పేపర్ వర్క్ బాగా చేయించి రీమేక్, టైటిల్ రైట్స్ కొనుగోలు చేసారు.
మర్యాద రామన్న (Maryada Ramanna)
కమెడియన్ సునీల్ నటించిన ఈ సినిమాకు రాజమౌళి నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా తీస్తున్నప్పటికే టైటిల్ రిజిస్టర్ అయిపోయి ఉండడంతో ప్రమోషన్స్‌కి ముందు ఫిలిం ఛాంబర్‌తో బేరసారాలు చేసి టైటిల్‌ను దక్కించుకున్నట్లు అప్పట్లో టాలీవుడ్‌లో ఓ టాక్ నడిచింది.
ఇప్పుడు వారణాసి టైటిల్‌కు ఉన్న ఇబ్బందులపై రాజమౌళి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కానీ ఇప్పటివరకు రాజమౌళి తీసిన సినిమాలకు ఆల్రెడీ ప్రకటించేసిన టైటిల్స్ కాకుండా వేరే టైటిల్స్ మార్చినట్లు చరిత్రలో లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అంతా భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మందాకినిగా హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా టైటిల్ లాంచ్ ఈవెంట్ జరిగింది.





