Gautam Gambhir pitch controversy: ఈరోజు వెస్ట్ బెంగాల్‌లోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. భారత్ ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం కోచ్ గౌతమ్ గంభీరే అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. షార్ప్ పిచ్‌పై మ్యాచ్ ఆడారని.. దాని వల్లే భారత్ ఓడిపోయిందని నోరుపారేసుకుంటున్నారు. అయితే.. ఆ పిచ్ కావాలని అడిగింది గౌతమ్ గంభీర్, టీమిండియానే అని క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మీడియా ద్వారా వెల్లడించారు. దాంతో టీమిండియా పరిస్థితి అడిగి మరీ తన్నించుకున్నట్లైంది.
ఈరోజు టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడానికి కారణం వాళ్లు సరిగ్గా ఆడకపోవడమే కాకుండా పిచ్ కూడా కీలక పాత్ర పోషించిందని అన్నారు. అయితే అలాంటి పిచ్ కావాలని అడగడంతో గంభీర్ తప్పేమీ లేకపోయినప్పటికీ టీమిండియా ఎప్పుడు మ్యాచ్ ఆడినా కూడా మంచి పిచెస్ మీదే ఆడాలని సూచించారు. అదీ కాకుండా గంభీర్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ వంటి ఫాస్ట్ బౌలర్లను పక్కన పెట్టి పెద్ద తప్పు చేసాడని అన్నారు. హోం గ్రౌండ్‌లో మ్యాచ్ జరుగుతున్నంత మాత్రాన వారిని పక్కన పెడితే నష్టం మనకే అని గుర్తుచేసారు. అదీకాకుండా టెస్ట్ మ్యాచ్‌లు ఐదు రోజుల పాటు జరగాలని కేవలం మూడు రోజులకే పరిమితం కాకూడదని సూచించారు. మూడు రోజుల్లోనే పిచ్ సహకరించేలా ఏర్పాట్లు చేసుకుంటే బ్యాక్ ఫైర్ అవుతుందని.. అది మున్ముందు టీమిండియాకు నష్టం కలిగిస్తుందని అన్నారు.
భారత్ ఎందుకు ఓడిపోయింది?
దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సిమోన్ హార్మర్ భారత బౌలర్ల కంటే మెరుగ్గా బౌలింగ్ చేయడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణం అని చెప్పాలి. మరోపక్క బ్యాటింగ్ కూడా పడిపోయింది. టీమ్ మధ్య సఖ్యత అంతగా కనిపించలేదు. హోం టెస్ట్‌లలో భారత్ ఓడిపోవడం ఇది నాలుగో సారి. గతేడాది న్యూజిల్యాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఓడిపోయారు. దాంతో అసలు టీమిండియా పిచ్‌ల విషయంలో సరిగ్గా ఆలోచిస్తోందా లేదా.. కఠిన స్పిన్ ట్రాక్స్‌పై బ్యాటింగ్ టెక్నిక్స్‌ను పరిశీలించుకుంటోందా లేదా… ఇలాంటి పరిస్థితుల్లో సరైన బౌలర్లను ఎంచుకుంటున్నారా లేదా అనే అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నెల 22న గువహాటిలో రెండో టెస్ట్ మ్యాచ్ ఉంది. మరి ఈ మ్యాచ్‌లో అయినా ఇండియా రాణిస్తుందో లేదో చూడాలి.





