Sama Ram Mohan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో BRS మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు అని కవిత ఆంగ్లంలో ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్‌గా వాడుకుంటున్నట్లు ఉంది. అందుకే ఆ పార్టీ TPCC ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కవిత పెట్టిన ట్వీట్‌కు బదులు ఇచ్చారు.
మళ్లీ మళ్లీ కొడతాం కవిత గారూ.. అని ఆయన రిప్లై ఇవ్వడం వైరల్ అవుతోంది. కొంతకాలంగా BRS పార్టీ అంతర్గత విభేదాలతో అల్లాడుతోందన్న విషయం తెలిసిందే. పార్టీలో ఉన్న ఇతర నేతల మధ్య సఖ్యత లేదంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ పార్టీ పెట్టిన కుటుంబంలోనే సమస్యలు వచ్చాయి. కవిత పట్ల తన సొంత అన్న KTR, బంధువు అయిన హరీష్ రావు కుట్ర పన్నారని.. తనని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ఆమె బహిరంగంగా చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
దాంతో కవిత BRSకు దూరంగా తాను స్థాపించుకున్న తెలంగాణ జాగృతి కోసం పనిచేస్తున్నారు. BRS పార్టీకి సంబంధించిన ఎలాంటి అంశాల్లోనూ ఆమె కలగజేసుకోవడం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కూడా ఆమె ప్రచారంలో పాల్గొనలేదు. తన మనసు విరిగిపోయిందని.. ఇక మళ్లీ పార్టీ ముఖం చూసేదే లేదని కన్నీరుపెట్టుకున్నారు. అయితే.. ఇప్పుడు BRS జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓడిపోవడానికి కారణం తన ఇంట్లో వారు తనకు చేసిన అన్యాయమే.. కర్మ అనుభవించతప్పదు అన్నట్లు ట్వీట్ చేసారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ వారు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.






