Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ 25 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మంచి అర్థమవుతోంది కాబట్టే ఆశీర్వదించారని అన్నారు. గతంతో పోల్చుకుంటే తెలంగాణలో కాంగ్రెస్‌కు మెజార్టీ అంతకంతకూ పెరుగుతోందని అన్నారు. జనరల్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే రాజకీయాలు చేస్తూ అబద్ధపు ప్రచారాలు చేయద్దు అని ప్రధాన ప్రతిపక్షం అయిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు సూచించారు.
మొన్న ఎన్నికల్లో ఓడిపోయామన్న అసూయతో అసెంబ్లీలో హరీష్ రావు చూసే చూపులకు పక్కన ఉన్నవాళ్లు మాడి మసైపోతారేమో అనిపిస్తోందని.. అంత అసూయ పనికిరాదని అన్నారు. ఇక KTR అహంకారం తగ్గించుకుంటే మంచిదని.. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీ తమకు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని.. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేసుకుందామని అన్నారు. కిందపడినా కూడా పైకాలు నాదే అన్నట్లు KTR ప్రవర్తిస్తే నష్టం వారికే అని అన్నారు.
కొన్ని అనుకూల మీడియా వర్గాలు కూడా BRS కంటే ముందే తమకే ఆధిక్యం అని తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని.. అది చాలా తప్పని అన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చి BRS ఎగ్జిట్ పోల్స్, సర్వేలు చేయిస్తోందని ఎంత చేసినా చివరికి ప్రజలే సమాధానం చెప్పారని తెలిపారు. రాజకీయాల్లో ఇంకా కొనసాగే అవసరం ఉంది కాబట్టి వ్యక్తిగత మాటలు, వ్యవహారాలు పక్కన పెడితే బాగుంటుందని సూచించారు. KCRని తప్పించి KTR, హరీష్ రావు కుర్చీ లాక్కోవాలని చూస్తున్నారని.. అందుకే KCR క్రియాశీల రాజకీయాల్లో లేరని అన్నారు.





