KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో BRS పార్టీ ఓడిపోయినప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో మాత్రం సక్సెస్ అయ్యామని అన్నారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ఈ ఎన్నిక ఫలితాలతో కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. ముఖ్యంగా సోషల్ మీడియా వారియర్ల కృషికి తానేం ఇచ్చినా రుణం తీర్చుకోలేనని అన్నారు.
ఎప్పటికప్పుడు తమపై వస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పి కొట్టడంలో సోషల్ మీడియా వారియర్లు ముందున్నారని అన్నారు. ఇప్పుడు జరిగిన ఎన్నిక ఫలితాన్ని మనసులో పెట్టుకోకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుదామని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో కేసీఆర్ మీద అభిమానంతో స్వచ్ఛందంగా పనిచేసే తమ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని చెప్పారు. అసలు ఎందుకు BRSకు మంచి పట్టు ఉన్న నియోజకవర్గంలో ఓడిపోయాం అనే దానిపై అందరితో కూర్చుని చర్చించుకుంటామని అన్నారు. ప్రజలు మరోసారి ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్‌ను ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంటామని అన్నారు.
గతంలో జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో తమ ప్రభుత్వమే గెలిచిందని.. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ఓటమిని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ తీర్పుతో తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ ఏదన్నా ఉందంటే అది BRS అని ప్రజలు స్పష్టం చేసారని అన్నారు. ముందుగా చెప్పినట్లుగా భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు కోల్పోయిందని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ తమ్ముడికి మూడు దొంగ ఓట్లు ఉన్నాయని.. చాలా మటుకు దొంగ ఓట్లు పడ్డాయని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు.





