Ayyannapatrudu: అసెంబ్లీకి రాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచిన వారంతా జీతాలు మాత్రం తీసుకుంటున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ఒక్క వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రమే జీతం తీసుకోవడం లేదని.. కానీ మిగతా వారు అసెంబ్లీకి రాకపోగా జీతాలు మాత్రం చక్కగా సమయానికి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఆఫీస్‌కి రాకుండా పని చేయకుండా ఉంటే అతన్ని ఉద్యోగం నుంచి తీసేయరా.. మరి అదే ప్రక్రియ ఇలా అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకునే వారికి వర్తించదా అని ప్రశ్నించారు.
అయితే ఈ అంశంపై వైసీపీ మద్దతుదారులు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయి ఈసారి అసెంబ్లీలోకి గెలిచాకే అడుగుపెడతాను అని చెప్పి నాలుగేళ్ల పాటు అసెంబ్లీకి రాని చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడరని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనే అంశం హైకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అంటున్నారు. అసెంబ్లీకి రావాలి రావాలి అంటూ మీడియా ముందు కేకలు వేస్తే సరిపోదని.. ఒకవేళ వచ్చినా సబ్జెక్ట్‌పై మాట్లాడటం.. సబ్జెక్ట్ ప్రకారమే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేలా ఉండాలి కానీ.. వ్యక్తిగత దూషణలు చేస్తున్నప్పుడు దేవాలయం లాంటి అసెంబ్లీకి వచ్చి కూడా ఏం లాభమని నిలదీస్తున్నారు.





