Hand Sanitizer కోవిడ్ పుణ్యమా అని యావత్ ప్రపంచం సానిటైజర్లను మంచి నీళ్లు వాడినట్లు వాడేసింది. ఇప్పటికీ ముందు జాగ్రత్తగా సానిటైజర్లు మాటిమాటికీ వాడేవారు ఉన్నారు. దాదాపు ఏడేళ్ల నుంచి విపరీతంగా ఈ సానిటైజర్లు వాడుతూ వస్తుండగా.. యూరోపియన్ యూనియన్ బాంబు పేల్చింది. ఆ సానిటజైర్ల వల్ల క్యాన్సర్ ముప్పు ఉందని ప్రకటించింది.
ఈ సానిటైజర్లలో వాడే ఈథనాల్ అనే రసాయనం వల్ల క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉందని ఇటీవల చేసిన పరిశోధనల్లో తేలినట్లు యూరోపియన్ కెమికల్స్ ఏజెన్సీ (ECHA) వెల్లడించింది. దాంతో ఈథనాల్‌ను బ్యాన్ చేయాలని చూస్తోంది. ఇప్పుడు దాదాపు అన్ని క్లీనింగ్ ఉత్పత్తుల్లో ఈథనాల్ వాడుతున్నారు. ఇక నుంచి ఈథనాల్ బదులు వేరే రసాయనాన్ని ఉపయోగించాలని వెల్లడించింది. మొత్తానికి ఈథనాల్ వాడాలా వద్దా అనేది యూరోపియన్ కమిషన్ ఫైనల్ నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటనను నవంబర్‌లో చేసే అవకాశం ఉంది.
ఈథనాల్ ఎందులో వాడతారు?
ఈథనాల్‌ను ప్రస్తుతం సానిటైజర్లు, హాస్పిటల్‌లో వాడే క్లీనింగ్ ఏజెంట్స్, ఫుడ్ ప్రొడక్షన్ డిస్ఇన్‌ఫెక్టెంట్స్, రోజూవారీ క్లీనింగ్ ఉత్పత్తుల్లో వాడుతున్నారు. కోవిడ్ సమయంలో ఈథనాల్ ఉన్న సానిటైజర్లు, క్లీనర్లు వాడాలని వెల్లడించడంతో వీటి వాడకం ఎక్కువైపోయింది. ఎందుకంటే కఠినమైన వైరస్, బ్యాక్టీరియాలను హరించే శక్తి ఈథనాల్‌కు ఉంది. ఈ ఈథనాల్ అనేది క్యాన్సర్ కారకమే కాదు.. రీప్రోటాక్సిక్ కూడా. అంటే గర్భం దాల్చలేకపోవడం, గర్భం దాల్చినా కూడా బిడ్డ లోపల ఎదగక అవిటితనంతో పుట్టడం వంటి సమస్యలు వస్తాయి.