Jagan vs CBN: ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు వెళ్లారు. వైసీపీ నేత ప్రసన్నకుమార్‌తో పాటు.. జైలులో ఉన్న కాకాణి గోవర్ధన్‌ను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ పర్యటన తర్వాత కూటమికి చెందిన దాదాపు ఏడుగురు మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టారు. జగన్ ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ పని అయిపోయింది.. 11 సీట్లే.. పులివెందుల ఎమ్మెల్యే అంటూ ఎగతాళి చేసారు. అంతగా ఎగతాళి చేసిన వారు ఇప్పుడు అంతగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాల్సిన అవసరం తెలుగు దేశం పార్టీ నేతలు, కూటమి నేతలకు ఏముంది?
జగన్ మోహన్ రెడ్డి గురించి నిరంతరం భయపడుతున్న వ్యక్తి ఎవరు అంటే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఆయన రాజకీయాల్లో చాలా మందిని ఎదుర్కొన్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని ఒక వ్యక్తిని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడుకు జగన్‌ని చూసి ఆ సామెత గుర్తొచ్చింది అని చెప్పచ్చు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు, దివంగత నేత రాజశేఖర్ రెడ్డిలు ప్రత్యక్ష రాజకీయాలు చేసారు పరోక్ష రాజకీయాలు కూడా చేసారు. వీరి సత్తా ఏంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు.
అయితే.. ఇప్పుడు వీరి కొడుకుల గురించి ఆలోచిస్తే.. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ విదేశాల్లో మంచి విద్యనభ్యసించారు. ఆయనకున్న తెలివితేటలతో ఒక మంచి కంపెనీలో టాప్ పొజిషన్‌లో ఉండచ్చు. లేదా చంద్రబాబు నాయుడు ఏదన్నా బిజినెస్ ప్లాన్ చేసి ఉంటే దానిని బాగా నిలబెట్టే సత్తా ఉన్నవారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో తనని తాను నిలదొక్కుకున్న మనిషి. రాజకీయాల్లో జగన్‌కు ఒక గుర్తింపు ఉంది. రాజశేఖర్ రెడ్డి కుమారుడుగా కంటే కూడా జగన్ అనే పేరుకే మాస్ ఫాలోయింగ్ ఉంది. కానీ లోకేష్ విషయంలో ఆయనకు గుర్తింపు ముందు చంద్రబాబు నాయుడే. లోకేష్‌కు ప్రజల్లో అంత గుర్తింపు లేదు.
చంద్రబాబు నాయుడు వయసు పైబడుతోంది కాబట్టి.. ఆయన తర్వాత పార్టీ బాధ్యతలు లోకేష్ చూసుకుంటాడు అనుకుంటున్నారు. అందులో తప్పేం లేదు. కానీ ప్రతిపక్ష హోదాలో జగన్ ఉండగా లోకేష్ నిలదొక్కుకోవడం అనేది అంత సులువుగా జరగని పని. ఈ విషయంలో చంద్రబాబు నాయుడుకు భయం మొదలైంది. దాంతో జగన్‌ను ఆయన పార్టీని అణచివేయాలని ఆయన ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. వైసీపీకి ఉన్న ఏకైక మైనస్ పాయింట్ ఏంటంటే.. సప్త సముద్రాలు ఈదగలుగుతున్నారు కానీ ఇంటి ముందు ఉన్న కాలువలో మునిగిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని జగన్ నామరూపాలు లేకుండా చేసారు. ఒక రకంగా చెప్పాలంటే దాదాపు పదేళ్ల నుంచి అసలు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అనే పేరే వినిపించడంలేదు. అప్పుడప్పుడే రాజకీయం నేర్చుకుంటున్న జగన్‌ను చంద్రబాబు నాయుడు 2014లో ఓడించేసారు. ఆ తర్వాత జగన్ 2019లో ఎలా ప్రభంజనం సృష్టించారో తెలిసిందే. ఇది అసలు చంద్రబాబు నాయుడు ఊహించలేకపోయారు. అందుకే ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా జగన్‌ను ఓడించాలన్న ఉద్దేశంతో పొత్తులు పెట్టుకున్నారు.
జగన్ ఎప్పుడూ కూడా చిన్నాచితకా అంశాలపై కాకుండా ఓడినప్పుడు ఆ తర్వాత కుంభస్థలం బద్ధలుగొట్టే దిశగా అడుగులు వేస్తారు. జగన్ ప్లానింగ్ ఎప్పుడూ కూడా శాశ్వత పరిష్కారాలపై ఉంటుంది. అది ఆల్రెడీ 2024 ఎన్నికల్లో రుజువైంది. ఎలాగంటే.. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని నిస్సహాయ స్థితికి తెచ్చి అసలు ఏమీ తెలీని పవన్ కళ్యాణ్.. నోటికొచ్చినట్లు తిట్టి, తిట్టించుకున్న నరేంద్ర మోదీలతో పొత్తు పెట్టుకునే స్థాయికి తెచ్చేసాడు.
ఇప్పుడు 11కే పరిమితం అయిన జగన్.. ఈసారి మరోసారి కుంభస్థలం బద్ధలుకొట్టే దిశగా అడుగులు వేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష హోదా లేదు అని ఎగతాళి చేస్తున్న అధికార పార్టీ నేతలు జగన్ సమావేశంలో ఎంత మంది జనాలు వచ్చారు అని వెతుక్కుని దానిపై ట్రోల్స్ చేస్తూ సమావేశాలు పెట్టే స్థాయికి వచ్చేసారంటే జగన్ గేమ్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చా?