Manchu Vishnu: మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటించిన కన్నప్ప సినిమా ఈ నెలాఖరున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు మంచు విష్ణునే నిర్మాతగా వ్యవహరించారు. కొన్ని వందల కోట్లు పెట్టి తెరకెక్కించిన చిత్రం ఇది.. శివుడే తన చేత ఈ సినిమాను చేయించాడు అంటూ మంచు విష్ణు మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, ఇతర ఇంటర్వ్యూలో చాలా సార్లు వెల్లడించారు. ఇందులో మోహన్ బాబు కీలక పాత్రలో నటించగా.. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు.
అయితే.. సినిమా రిలీజ్‌కు ఇంకొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో మంచు విష్ణు అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన పెద్దలకు తన సినిమాను చూపించి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా.. ఈ సినిమాను సూపర్‌స్టార్ రజినీకాంత్ వీక్షించారు. మోహన్ బాబు, మంచు విష్ణు స్వయంగా రజినీకాంత్ ఇంటికి వెళ్లి మరీ కన్నప్ప సినిమాను చూపించారు. సినిమా చూసాక రజినీకాంత్ శెభాష్ అంటూ మంచు విష్ణును ఆలింగనం చేసుకున్నారట. ఈ విషయాన్ని మంచు విష్ణు ఎక్స్ ద్వారా వెల్లడిస్తూ తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు.
“” నిన్న రాత్రి రజినీకాంత్ అంకుల్ కన్నప్ప సినిమా చూసారు. సినిమా చూసాక ఆయన ఆప్యాయంగా నన్ను ఆలింగనం చేసుకుని మెచ్చుకున్నారు. ఒక నటుడిగా ఆయన ఆలింగనం కోసం నేను 22 ఏళ్లు ఎదురుచూసాను. ఈరోజు నాకెంతో ప్రోత్సాహకరంగా ఉంది. ఈ నెల 27న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మీరంతా ఎప్పుడెప్పుడు ఆ శివ లీలను చూస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నాను “” అని పేర్కొన్నారు.
ఇక మొన్న రిలీజ్ అయిన కన్నప్ప ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనవసరంగా మంచు విష్ణు కొన్ని సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన ట్రోలింగ్‌కు గురవుతున్నారు కానీ సినిమా మాత్రం బాగానే ఉండబోతోంది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది ప్రభాస్ కోసమే సినిమాకు వెళ్తాం అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలు చూసాక థియేటర్ నుంచి వెళ్లిపోతాం అంటూ వెటకారంగానూ కామెంట్స్ పెడుతున్నారు. ఒక ఇందులో శివుడి పాత్రలో కనిపించిన అక్షయ్ కుమార్ పాత్ర పట్ల నెటిజన్లు సంతృప్తికరంగా లేరు. దేవోంకా దేవ్ మహాదేవ్ అనే హిందీ సీరియల్‌లో శివుడి పాత్రలో నటించిన మోహిత్ రైనాను పెట్టి ఉంటే సినిమా మరో రేంజ్‌లో ఉండేదని అంటున్నారు.