China: ఎవరైనా చాలా బక్కగా ఉన్నారనుకోండి.. వారిని ఇంట్లో వారు, స్నేహితులు సరదాగా ఆటపట్టిస్తుంటారు. బయట గాలులు ఎక్కువగా ఉన్నాయట. నువ్వు బయటికి వెళ్లకు ఎగిరిపోతావ్ అని పాపం ఏడిపిస్తుంటారు. ఇలా చాలా మందికి అనుభవం అయ్యుంటుంది. అలా స్నేహితులు, ఇంట్లో వాళ్లు ఆటపట్టించడం వేరు. కానీ ఇదే విషయాన్ని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటిస్తే? అదేంటి.. ప్రభుత్వం అలా ఎందుకు ప్రకటిస్తుంది అనుకుంటున్నారా? కానీ ఈ ప్రకటన నిజంగానే జరిగింది. అది కూడా చైనాలో.
అసలు మ్యాటర్ ఏంటంటే… ఉత్తర చైనాలో ఈ వారం మొత్తం ఈదురు గాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉందట. దాంతో అక్కడి ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. రవాణా శాఖను తాత్కాలికంగా నిలిపివేసింది. దాదాపు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. 50 కిలోలు, అంత కంటే తక్కువ బరువు ఉన్నవారు అసలు బయటికే రావద్దని చెప్పింది. ఎందుకంటే ఆ ఈదురు గాలులకు ఎగిరిపోతారని.
దాదాపు పదేళ్ల తర్వాత ఇంతటి స్థాయిలో ఈదురు గాలులు సంభవించనున్నాయట. అందుకే.. ఎవరు ఏమనుకున్నా ప్రజలను అప్రమత్తం చేయడం మన పని అని భావించిన అక్కడి ప్రభుత్వం 50 కిలోలు అంతకంటే తక్కువ బరువున్నవారు మాత్రం కనీసం ఇంటి బాల్కనీలోకి కూడా రావద్దని చెప్పింది.