Viral Video: కొద్ది రోజుల్లో పెళ్లి. కుటుంబీకులు, స్నేహితులను ఆహ్వానించేందుకు ఎంతో సంతోషంగా వారి ఇళ్లకు వెళ్లి శుభలేఖలు ఇవ్వాలనుకున్నాడు. కానీ విధికి పాపం అతని పట్ల కన్నుకుట్టిందేమో. తనతో పాటు తీసుకుపోయింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. శుభలేఖ ఇవ్వడానికి కారులో బయలుదేరిన వ్యక్తి కారులోనే సజీవదహనం అయ్యాడు. గ్రేటర్ నోయిడాలోని నవాడా ప్రాంతానికి చెందిన అనిల్ అనే వ్యక్తికి ఫిబ్రవరి 14న పెళ్లి జరగాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం స్నేహితుడికి శుభలేఖ ఇచ్చి వస్తానని తన వేగనార్ కారులో బయలుదేరాడు. సాయంత్రం అవుతున్నా ఇంకా అనిల్ ఇంటికి తిరిగి రాలేదు. దాంతో అతని సోదరుడు సుమిత్ ఫోన్ చేసాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. తనే వస్తాడులే అని ఎదురుచూస్తుండగా.. సాయంత్రం పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. అనిల్‌కి యాక్సిడెంట్ అయ్యిందని.. కారులో మంటలు చెలరేగడంతో అతను సజీవదహనం అయ్యాడని అన్నారు. దాంతో ఆ కుటుంబం హతాశులైంది. ఎంతోకాలంగా వాడుతున్న కారులో ఉన్నట్టుండి మంటలు రావడం పట్ల వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.