Crocodile Tears: చాల్లే ఊరుకోవయ్యా.. చేసిందంతా చేసి మొసలి కన్నీరు కారుస్తున్నావా? ఈ సామెత ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా వినే ఉంటాం. అసలు ఒక మనిషి చేసిన పనికి.. మొసలి కన్నీరుకి సంబంధం ఏంటి? మొసలి కన్నీరు కారుస్తున్నాడు అని ఎవరైనా అంటే.. దాని అర్థం తన ప్రయోజనం కోసం లేదా ఇతరులను మోసం చేయడానికి దొంగ కన్నీళ్లు కారుస్తున్నాడని. మరి మొసలి కన్నీరు అనే సామెత ఎందుకొచ్చినట్లు?
దాని వెనుక ఓ కథ ఉంది. మొసలి ఏదైనా తిన్న తర్వాత దాని సైనస్ గ్రంథుల్లో గాలి ఇరుక్కుని ఉంటుంది. దాని వల్ల మొసలి కంట్లో నుంచి నీరు కారుతుంటాయి. అంతేకానీ.. మొసలి నిజంగా ఏడుస్తోందని కాదు. కానీ చూసేవారికేమో మొసలి పాపం ఆకలి బాధకి ఏడుస్తోందేమో అనుకుంటాం. నిజానికి అది ఏ జంతువునో తినేసి దాని గ్రంథుల్లో ఇరుక్కున్న గాలిని కంట్లో నీటి ద్వారా వదులుతోందని చాలా మందికి తెలీదు. అందుకే మొసలి కన్నీరు అనే సామెత వచ్చింది.