Vallabhaneni Vamsi: వైఎస్సార్ కాంగ్రెస్.. తెలుగు దేశం పార్టీ.. ఈ రెండు పార్టీ పేర్ల గురించి వినంగానే అమ్మో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత శతృత్వం వారిది అనుకుంటాం. ఇలా మనకు పైకి మాత్రమే కనిపించే ఎనిమీస్‌లా ఉంటారు కానీ వెనక మాత్రం ఎవరికి వారు బాగానే దోచి పెడుతున్నారు అనడంలో ఈ ఘటనే ఉదాహరణ. ఇంతకీ ఇప్పుడు ఏం జరిగిందంటే..
గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సభ జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకోసం పెద్ద ఎత్తున సభా వేదికను ఏర్పాటు చేసారు. దీనికి వల్లభనేని వంశీ అనుచరులు సతీష్, రఘు, మహి.. ఇతర వనరులు సమకూర్చారు. రఘు అనే వ్యక్తి పని గ్రావెల్ మాత్రమే తరలించాలి. అలాంటిది.. సీఎం ప్రమాణ స్వీకార సభకు ఆయనతో మట్టి తరలించపజేసారు. ఆ తర్వాత TDP మంత్రి తన పలుకుబడి ఉపయోగించి అందరి కంటే ముందుగా ఈ ఇద్దరికీ కలిపి రూ.4.8 కోట్ల బిల్లును విడుదల చేయించారు. ఇది ఆ మంత్రి ఘనత. ఒకవైపు సతీష్ చేసిన అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్ విచారణ కొలిక్కి రాకుండా చేయడంతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు సత్వరమే విడుదల చేయించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు సతీష్ అక్రమ మైనింగ్ ఆగడం లేదు. తిరువూరు నియోజకవర్గంలోని కొండవాగులో 28 ఎకరాల భూమిలో గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. దానికి గనుల శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదు. పర్యావరణ అనుమతులు కూడా లేవు. జగన్ జమానా నుంచి మైనింగ్ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా గత 6 నెలలుగా దర్జాగా మట్టి దోపిడీ సాగుతోంది. దీనికి కర్త, కర్మ, క్రియ సతీష్ అయితే.. ఆయన్ను వెనకుండి నడిపిస్తోంది మాత్రం తెదేపా మంత్రే. తిరువూరు నియోజకవర్గం కొండపర గ్రామంలో 28 ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేస్తూ నూజివీడు నియోజకవర్గం చిల్లబోయిన పల్లి గ్రామంలో మట్టి తవ్వకాలు చేస్తున్నట్లు వారికి ట్రాన్సిట్ పర్మిట్లు ఇప్పించారు. అంటే అక్రమంగా తవ్వుతున్నది కొండపరులో.. దానికి ట్రాన్సిట్ పర్మిట్లు చూపిస్తోంది చిల్లబోయిన పల్లిలో. (Vallabhaneni Vamsi)
ఇటీవల కాలంలో ఈ విషయం రచ్చకెక్కడంతో తెలుగు దేశంలోని కొందరు నేతలు అక్రమ మైనింగ్ వాహనాలను అడ్డుకునేందుకు యత్నించారు. గనుల శాఖ విజిలెన్స్ విభాగం కొన్ని వాహనాలను నిలిపేసింది. రెవెన్యూ అధికారులు కొన్ని లారీలను సీజ్ చేసారు. వెంటనే సదరు మంత్రి రంగంలోకి దిగారు. ఆ లారీలు మావాళ్లవే..వాటిని వదిలేయండి అని రెవెన్యూ అధికారులకు మంత్రి నేరుగా ఫోన్ చేసి ఒత్తిడి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అక్రమంగా మైనింగ్ చేసి.. తప్పుడు ట్రాన్సిట్లతో గ్రావెల్ సరఫరా చేస్తున్నారు. ఇందులో వైసీపీ నేత కే.సతీష్ పాత్ర ఉంది. లారీలు ఆయనవే. గతంలో ఈ వాహనాలను వైసీపీ మాజీ మంత్రి కోసం తిప్పారని.. మంత్రికి రెవెన్యూ అధికారి వివరించారు. దీంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు. YSRCP ఏంటి.. TDP ఏంటి.. ఆ లారీలు మావాళ్లవే. అతను మా మనిషే. వైసీపీ అని ఎవరు చెప్పారు నీకు? లారీలు వదిలేయ్. ఇంకోసారి ఈ సమస్య రావద్దు. అని ఆ మంత్రి తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం.
దీంతో అధికారులు మట్టి మాఫియా లారీలను వదిలేసారు. గనుల శాఖ నుంచి దొంగ రవాణా బిల్లుల వరకు ప్రతీదీ సదరు మంత్రి గారే స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. అక్రమ మైనింగ్ వాహనాలను రెవెన్యూ, గనుల శాఖ విజిలెన్స్ విభాగాలు సీజ్ చేస్తుంటే మంత్రి ఆగమేఘాల మీద కదిలిపోతున్నారట. అవి.. తమ మనుషుల వాహనాలేనని వాటిని వదిలేయాలంటూ స్వయంగా ఫోన్లు చేస్తున్నారు. ఇక ఆయన పేషీ అయితే.. మట్టి మాఫియా సేవలో తరించిపోతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చిచ్చు రేపుతున్న మట్టి మాఫియాకు సారథిగా సదరు మంత్రి వ్యవహరిస్తుండడం కలకలం రేపుతోంది. (Vallabhaneni Vamsi)
జగన్ జమానాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయి అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. కొండలు, సాగు భూములు ఏవీ వదల్లేదు. ఇటు పర్యావరణానికి హాని చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని.. గన్నవరం వైసీపీ నేత వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు ఈ మాఫియాలో కీలకం అని ప్రజలే బాహాటంగా చెప్తున్నారు. వీరి అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఎన్నో పోరాటాలు చేసింది. ఈ క్రమంలో ఎందరో టీడీపీ కార్యకర్తలు, నేతలు వైసీపీ నేతల చేతుల్లో దారుణమైన దాడులకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొడాలి నాని, వంశీ అనుచరులు అక్రమ మైనింగ్‌లకు పాల్పడ్డారని ఫిర్యదులు అందాయి. దీంతో అక్రమ మైనింగ్‌పై గనుల శాఖ విజిలెన్స్ దాడులు జరిగాయి.
భారీగా మట్టి తవ్వకాలు జరిగాయని ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం చేకూర్చారని గనుల అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సతీష్ మట్టి మైనింగ్‌పై 35 కోట్ల రూపాయలు, కొడాలి నాని అనుచరుడి మైనింగ్‌పై 40 కోట్ల రూపాయల పెనాల్టీ విధించేలా గనుల శాఖ నివేదికలు సిద్ధం చేసింది. దాంతో సదరు మంత్రి వారిని కాపాడతానని వైసీపీ నేతలకు అభయం ఇచ్చారు. విజిలెన్స్ విచారణను ముగించకుండా పెండింగ్ పెట్టాలని.. డిమాండ్ నోటీసులు తయారు చేయొద్దని గనుల అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. దీంతో గత 6 నెలలుగా విచారణ సాగుతూనే ఉంది. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలీనంతగా మంత్రి ఒత్తిళ్ల పర్వం కొనసాగుతోంది.