Cholesterol ఒంట్లో చెడు కొవ్వు పేరుకుపోయి.. దానికి తోడు ట్రైగ్లిజరైడ్స్ చేరాయంటే గుండె పోటు వస్తుందని అందరికీ తెలిసిందే. కొవ్వు శరీరానికి ఎంతో అవసరం. కానీ అది HDLలో ఉండాలి కానీ హానికరమైన LDLలో కాదు. మరి ఒంట్లో LDL కొవ్వు ఎక్కువగా పేరుకుపోయిందని ఎలా తెలుస్తుంది? వైద్య పరీక్షలు చేయించుకుంటే తెలుస్తుంది. కానీ వైద్య పరీక్షల కంటే ముందే మన శరీరం ఒంట్లో చెడు కొవ్వు పేరుకుపోతోంది జాగ్రత్తపడూ.. అని కొన్ని సంకేతాలను ఇస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతే శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరగదు. దీని వల్ల కాళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని తెలిపే మొదటి సంకేతం కాళ్ల నొప్పులు అని గుర్తుంచుకోవాలి. ఛాతిలో అప్పుడప్పుడు నొప్పిగా అనిపిస్తోందా? గుండెపై ఏదో బరువుగా ఉన్నట్లు అనిపిస్తోందా? అయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాల్సిందే.
మెడ, భుజాలు, దవడ భాగంలో నొప్పిగా అనిపిస్తున్నా కూడా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి. చాలా మంది ఈ నొప్పులను కండరాల నొప్పులు అనుకుంటారు. అలా అనిపిస్తుంది కానీ.. అది రక్త సరఫరా జరగకపోవడం వల్ల వస్తున్న నొప్పి. కొన్ని సందర్భాల్లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు పాదాలు నీలం రంగులోకి మారిపోతుంటాయి. ఉన్నట్టుండి ఊపిరి సరిగ్గా పీల్చలేకపోవడం, మెట్లు ఎక్కినప్పుడు విపరీతంగా ఆయాసం ఉండటం కూడా సంకేతమే. కొన్ని సందర్భాల్లో కంటి చుట్టూ పసుపు రంగులో వలయాలు ఏర్పడుతుంటాయి. వీటిలో ఏ ఒక్కటి మీకు ఉన్నట్టు అనిపించినా వెంటనే ఓసారి వైద్యులను సంప్రదించండి.